- శస్త్ర చికిత్స ద్వారా బయటకు తీసిన వైద్యులు
- ఏడాదిగా కంటిలోనే 9 సెం.మీ. వరకు పెరిగిన వైనం
సాక్షి, ముంబై: ఓ మహిళ కంటి నుంచి తొమ్మిది సెంటీమీటర్ల పొడవున్న కీటకాన్ని (వానపాము ఆకారంలో) వైద్యులు ఆపరేషన్ ద్వారా బయటకు తీశారు. ఏడాది కాలంగా మహిళ కంటిలోనే ఉన్న కీటకం అప్పటి నుంచి తొమ్మిది సెంటీమీటర్ల పొడవు పెరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గర్భవతి అయిన సంబంధిత మహిళకు ఎలాంటి హాని జరగకుండా వైద్యులు చికిత్స చేశారు. దక్షిణాఫ్రికాలో అరుదుగా కనిపించే ఈ కీటకాలు మన దేశంలో ఇప్పటి వరకు మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే కనిపించినట్లు సమాచారం. కాగా ఆమె పేరు, ఫొటో ప్రచురించడానికి బంధువులు నిరాకరించడంతో చికిత్స చేసిన వైద్యులు వివరాలు వెల్లడించారు. ఏడాది కిందట ఆమె కంటిలో ఏదో కదులుతున్నట్లు అనిపించడంతో కంటి డాక్టర్‌కు చూపించగా ఏమి లేదని చెప్పాడు. అయితే అలాగే జరుగుతుండటంతో ముంబైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి చూపించారు.
అయితే కంటిలో ఏదో కదులుతున్నట్లు వైద్యులు గుర్తించినప్పటికీ కచ్చితంగా అది ఏంటో నిర్ధారించలేకపోయారు. తరువాత మాటుంగా గాంధీ నర్సింగ్ హోంలోని సర్జన్ డాక్టర్ దీపక్ గాంధీని బాధితురాలు సంప్రదించింది. సోనోగ్రఫ్రీ చేయగా కుడి కంటిలో తొమ్మిది సెంటీమీటర్ల పొడవైన కీటకం ఉన్నట్లు ఆయన గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని గాంధీ చెప్పారు. కీటకాన్ని ప్రయోగశాలకు పంపామని, అక్కడి నుంచి నివేదిక వస్తే పూర్తి వివరాలు బయటపడతాయని ఆయన అన్నారు.
మహిళ కంటిలో కీటకం
Published Fri, May 8 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement