కనువిందు చేస్తున్న పతంగుల పండుగ
Published Tue, Jan 7 2014 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
న్యూఢిల్లీ: కన్నాట్‌ప్లేస్ ఆకాశవీధిలో సప్తరంగుల ప్రపంచం ఆవిష్కృతమయింది. ఇక్కడ మంగళవారం 26వ అంతర్జాతీయ పతంగుల ఉత్సవం ప్రారంభమయింది. దేశవిదేశాల నుంచి వచ్చిన గాలిపటాల ప్రియులు అనేక రగులు, పరిమాణాలు, ఆకారాలతో కూడిన భారీ పతంగులను ప్రదర్శిస్తున్నారు. సెంట్రల్‌పార్కులో నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో ఫ్రాన్స్, రష్యా, ఉక్రెయిన్, మలేషియా, వియత్నా, ఎస్టోనియాతోపాటు 10 భారతీయ నగరాల యువతీయువకులు పాల్గొంటున్నారు. దేశరాజధానిలో అంతర్జాతీయ పతంగుల ఉత్సవం నిర్వహించడం ఇది మూడోసారి. రష్యా నుంచి వచ్చిన స్టానిస్లావ్ కొల్బిన్‌స్టెవ్ ఎగరేసిన ఆరు భుజాల భారీ పతంగి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నైలాన్‌తో తయారు చేసిన ఈ పతంగిపై రెండు రష్యన్ ప్రముఖ కట్టడాలు సెయింట్ పీటర్స్‌బర్గ్ పాల్ కేథడ్రల్, క్రెమ్లిన్ నగర చిత్రాలు కనిపిస్తున్నాయి. ‘మీరు రష్యా గురించి ఆలోచించగానే ఈ రెండు కట్టడాలు మీకు గుర్తుకు వస్తున్నాయి. ఇక నా పతంగిపై ఉన్న డిజైన్లు చిన్నారులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. గాలిపటాన్ని దగ్గరగా చూడాలని వాళ్లు కోరుకుంటారు కాబట్టి దానిని తరచూ కిందికి దించుతున్నాను’ అని ఈ 41 ఏళ్ల రష్యన్ చెప్పారు.
ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడు దశాబ్దం క్రితం ఆయన పతంగుల క్రీడలపై ఆసక్తి పెంచుకున్నారు. అంతేకాదు స్వదేశానికి వచ్చిన తరువాత కూడా ‘కైట్ యూనివర్స్’ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ఏటా నాలుగుసార్లు పతంగుల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక ఢిల్లీవాసులు కూడా భారీగా పతంగులు ప్రదర్శిస్తున్నారు. ప్లాస్టిక్, నైలాన్, వస్త్రం, పేపర్ తదితర వస్తువులతో తయారైన గాలిపటాలు అందంగా కనిపించడమే కాదు వినోదాన్నీ పంచుతున్నాయి. గుజరాత్ పర్యాటక అభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం 14న సబర్మతి నదీతీరంలో ముగుస్తుంది. ‘ఢిల్లీలో మంగళవారం ఈ ఉత్సవాన్ని ముగించి, బుధవారం ముంబైలో నిర్వహిస్తాం. మరో నాలుగు నగరాల్లో ఏర్పాటు చేశాక, జనవరి 14న గుజరాత్‌లో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం’ అని గుజరాత్ పర్యాటకశాఖ సమన్వయ విభాగం అధికారి సోమన్ పాథీ చెప్పారు.
Advertisement