ఎన్‌డీఎంసీ ఆధ్వర్యంలో 33 ఎకో ఫ్రెండ్లీ జిమ్‌లు
Published Sun, Nov 10 2013 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
న్యూఢిల్లీ: నగరవాసుల్లో ఆరోగ్యస్పృహ పెంచేందుకు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్‌డీఎంసీ) బృహత్తర ప్రణాళికతో ముందుకొచ్చింది. ఎన్‌డీఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 33 పర్యావరణ అనుకూల జిమ్‌లను ఏర్పాటు చేయనుంది. అయితే వీటిని నగరవాసులు ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు. ఈ జిమ్‌లలో ఏర్పాటు చేసే సదుపాయాలన్నీ పర్యావరణ అనుకూలమైనవేనని, సులభంగా ఉపయోగించే విధంగా వీటిని డిజైన్ చేశారని ఎన్‌డీఎంసీ చైర్‌పర్సన్ జలాజ్ శ్రీవాస్తవ తెలిపారు. పార్కులలో ఏర్పాటు చేయనున్న ఈ జిమ్‌లలో పదిమీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్యుప్రెషర్ వాక్ సదుపాయాన్ని కల్పించనున్నామని, ప్రత్యేక రెయిలింగ్ కూడా ఏర్పాటు చేయడంతో సీనియర్ సిటిజన్లు కూడా ఉపయోగించేందుకు వీలుగా ఉంటుందన్నారు.
ఎయిర్ వాకర్, సిట్ అప్ బెంచ్, ఎయిర్ స్వింగ్, ట్విస్టర్, సెట్ బ్యాక్, పుష్ అండ్ పుల్ అప్ చైర్, షోల్డర్ వీల్, స్పిన్నర్, బెంచ్ విత్ ఫిక్స్‌డ్ డంబుల్ తదితర సామగ్రి ఉన్నాయన్నారు. వీటి ఏర్పాటు ఇప్పటికే పూర్తయిందని, త్వరలో వీటిని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ జిమ్‌లను కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్, సంజయ్ పార్క్, తాల్‌కటోరా గార్డెన్, నెహ్రూ పార్క్, చరక్ పాలికా హాస్పిటల్, ఎన్‌డీఎంసీ క్లబ్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, ఓల్డేజ్ హోమ్స్‌లతోపాటు వివిధ ప్రజాసేవా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటిని అందరూ ఉపయోగించుకునే అవకాశముందని, ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. నగరవాసులను ఆరోగ్యవంతులుగా చేసేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఎన్‌డీఎంసీ రూ. 1.9 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.
Advertisement