
మళ్లీ ఐసీయూలో జయలలిత
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను మళ్లీ ఐసీయూలో చేర్పించారు. సాధారణ వార్డులో చికిత్స పొందుతున్న జయలలితకు గుండెపోటు రావడంతో ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో జయలలితకు చికిత్స అందిస్తున్నారు.
మరో వైపు ఆదివారం జయలలిత పూర్తిగా కోలుకున్నారని ఎయిమ్స్ వైద్య నిపుణులు నిర్ధారించారని ఆ పార్టీ నేతలు చెప్పారు. త్వరలో జయలలిత డిశ్చార్జి అయి ఇంటికి వెళతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతలోనే మళ్లీ జయలలితకు గుండెపోటు వార్త రావడంతో పెద్ద మొత్తంలో కార్యకర్తలు ఆసుపత్రి దగ్గరకు చేరుకుంటున్నారు. సమాచారం తెలియగానే గవర్నర్ విద్యాసాగర్ రావు హుటాహుటిన ముంబై నుంచి చైన్నైకి బయలుదేరారు. మధురైలో అత్యవసర సమావేశాన్ని రద్దు చేసుకుని డీజీపీ రాజేంద్రన్ చైన్నై బయలుదేరి వెళ్లారు. అపోలో ఆసుపత్రి వద్ద భారీగా భద్రత పెంచారు. సెప్టెంబర్ 22 నుంచి అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.