చెన్నై, సాక్షి ప్రతినిధి: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ జయంతి సందర్భంగా పొత్తేరిలోని టానిగ్టన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి జయలలిత పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తమిళులకు ద్రోహం చేసిన కాంగ్రెస్, డీఎంకేకు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెప్పాలని అన్నాడీఎంకే శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్నాదురై ఆశీర్వాదంతో ఆవిర్భవించిన డీఎంకే ఆయన ఆశయాలను కరుణానిధి గాలికొదిలారని ఆరోపించారు. తన కుటుంబ సంక్షేమానికి పాటుపడుతున్నారని విమర్శించారు. కరుణానిధి అరాచకాలను తట్టుకోలేకనే ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించారని ఆమె గుర్తుచేశారు. 1996 నుంచి 2013 వరకు ఒక్క ఏడాది మినహా 17 ఏళ్లు కేంద్రంలో పెత్తనం చెలాయించిన కరుణానిధి రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదని దుయ్యబట్టారు. 2008లో భారత్ నుంచి శ్రీలంకకు ఆయుధాలు తరలివెళ్లినప్పుడు కరుణ పట్టించుకోలేదని, 2009లో శ్రీలంకలోని తమిళులు ఊచకోతకు గురైనప్పుడు యూపీఏలో ఉన్నా చలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు గత ఏడాది అకస్మాత్తుగా యూపీఏ నుంచి వైదొలిగారని పేర్కొన్నారు. కరుణ కుటుంబ పరిపాలన అవినీతిలో కూరుకుపోయి దేశానికే అప్రతిష్ట తెచ్చిందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్‌తో కటీఫ్ చెప్పానంటూనే కనిమొళి గెలుపుకోసం యాచనకు పాల్పడ్డారని ఎద్దేవా చేశారు. ఇలా అనేక విధాలుగా కరుణ కపట రాజకీయాలతో రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగూ ఓడిపోతుంది కాబట్టి శ్రీలంక సమస్యను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధికోసం ముందుగానే వైదొలగడం కరుణ మార్కు రాజకీయమని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని చిన్న పార్టీలు డీఎంకేతో జతకట్టకుంటే మళ్లీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునేందుకు ఆయన ఏమాత్రం వెనుకాడరని తెలిపారు. కావేరి జలాలు, విద్యుత్ వాటా, కచ్చదీవుల సమస్య తదితరాలపై కాంగ్రెస్ పార్టీ సైతం తమిళ ప్రజలకు ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, డీఎంకేల వైఫల్యాలన్నీ అన్నాడీఎంకేకు అంటగట్టేలా లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని, జాగ్రత్తగా ఉండాలని ఆమె పార్టీ కార్యకర్తలను అప్రమత్తం చేశారు. వారి దుష్ర్పచారాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, డీఎంకేలు చేసిన ద్రోహాన్ని వాడవాడలా ప్రచారం చేయాలని కోరారు. పార్టీ గెలుపు కోసం రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు సాగించనున్నట్లు ఆమె ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో 40 స్థానాలు గెలుపొందేలా సైనికుల్లా పనిచేయూలని విజ్ఞప్తి చేశారు. ఁవెట్రి మీదు వెట్రి వందు ఎన్నై సేరుం, అది వాంగితంద పెరుమై ఎల్లా ఉన్నైసేరుంరూ. (గెలుపుపై గెలుపు నన్ను చేరుతుంది, ఆ ఘనతంతా మీకు చెందుతుంది) అంటూ ఎంజీఆర్ నటించిన చిత్రంలోని సూపర్ హిట్ పాటను సభికుల హర్షధ్వానాల మధ్య ఆమె ప్రస్తావించారు.
ఎంజీఆర్‌కు ఘన నివాళి
Published Sat, Jan 18 2014 6:09 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement