
రాజకీయాల్లో షీలా అరంగేట్రం
సాక్షి, న్యూఢిల్లీ: 1996లో ఎన్నికైన ప్రభుత్వం ఏడాదిన్నరకే కుప్పకూలడంతో 1998లో 12వ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. రాజీవ్ గాంధీ హత్యతో డీఎంకేకు సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థ ఆరోపించింది. తమిళ వేర్పాటు వాదులతో డీఎంకే సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
ఈ ఆరోపణల నేపథ్యంలో తలెత్తిన వివాదంతో ఇంద్రకుమార్ గుజ్రాల్ నేతృత్వంలోని యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి సీతారామ్ కేసరి నేతృత్వంలోని కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో సీతారామ్ కేసరి నేతృత్వంలో పోటీ చేసింది. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయని కేసరి ఆశాభావంతో చెప్పిన జోస్యం నిజంగానే కాంగ్రెస్‌కు అశ్చర్యం కలిగించింది.
ఈ ఎన్నికలలో ఢిల్లీలోని ఏడు స్థానాలలో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. కరోల్ బాగ్ నుంచి మీరాకుమార్ గెలిచి పార్టీ పరువు నిలబెట్టారు.ఈ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ జరిగింది. మిగతా ఆరు స్థానాలలో బీజేపీ గెలిచింది. విబేధాలను పక్కనబెట్టి బీజేపీ నేతలు మదన్‌లాల్ ఖురానా, సాహిబ్‌సింగ్ వర్మ ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కృషి చేశారు. ఈ ఎన్నికలతో షీలా దీక్షిత్ ఢిల్లీ రాజకీయాల్లో అడుగుపెట్టారు.
ఈస్ట్ ఢిల్లీలో లాల్ బిహారీ చేతిలో ఓడిపోయిన షీలాదీక్షిత్ ఆ తరువాత పది నెలలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్‌ను గెలిపించడమే కాకుండా 15 సంవత్సరాలపాటు ఢిల్లీలో నిరాటంకంగా రాజ్యమేలారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఘోర పరాజయం పాలైన ఆమెకు కాంగ్రెస్, కేరళ గవర్నర్‌గా పంపింది.
లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గంలో అజయ్ మాకెన్‌ను ఓడించిన సుష్మాస్వరాజ్ ఆ తరువాత ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. కానీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం అనంతరం ఆమె ఢిల్లీ రాజకీయాల నుంచి నిష్ర్కమించారు. న్యూఢిల్లీలో బీజేపీ నేత జగ్‌మోహన్ కాంగ్రెస్ అభ్యర్థి ఆర్‌కె ధావన్‌ను ఓడించారు.
చాందినీ చౌక్‌లో జేపీ అగర్వాల్, బీజేపీ నేత విజయ్ గోయల్‌చేతిలో పరాజయం పాలయ్యారు. సదర్ నుంచి మదన్‌లాల్ ఖురానా, ఔటర్ ఢిల్లీ నుంచి కేఎల్ శర్మ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల నాటికి ఢిల్లీలో ఓటర్ల సంఖ్య 83 లక్షలకు పెరిగింది. 43 లక్షల మంది ఓటు వేశారు. 132 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వారిలో పది మంది మహిళలున్నారు.