
సూర్య పాత్రలో జయం రవి
తనీ ఒరువన్ చిత్రం విజయం తరువాత నటుడు జయంరవి రేంజ్ మారిపోయిందని చెప్పక తప్పదు. అలాగని అంతకు ముందు ఆయనకు విజయాలు లేవని కాదు. వాటిలో అధిక భాగం రీమేక్ చిత్రాలే. డెరైక్ట్ కథతో జయంరవి కెరీర్‌లో రూపొందిన తనీ ఒరువన్ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుందన్నది వాస్తవం. ఇక ప్రముఖ దర్శకులు కూడా జయంరవితో చిత్రాలు చేయడానికి ముందుకు వస్తున్నారు.
అలాంటి వారిలో దర్శకుడు గౌతమ్‌మీనన్ ఒకరు. అజిత్‌తో ఎన్నై అరిందాల్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తరువాత శింబు హీరోగా అచ్చం ఎంబదు మడమయడా చిత్రం చేస్తున్న గౌతమ్‌మీనన్ తదుపరి జయంరవి హీరోగా ఒక భారీ చిత్రం చేయనున్నారు. విశేషం ఏమిటంటే ఆయన ఇంతకుముందు విజయ్ హీరోగా యోహాన్ అధ్యాయం ఒండ్రు చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ చిత్ర కథ విజయ్‌కు సంతృప్తి కలిగించకపోవడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది.
అలాగే సూర్యతో ధ్రువనక్షత్రం చిత్రం చేయాలని సంకల్పించారు. ఆ చిత్ర కథ నచ్చలేదని సూర్య బహిరంగంగానే వెల్లడించారు. దీంతో సూర్యకు, గౌతమ్‌మీనన్‌కు మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు ప్రచారం తమిళ పరిశ్రమలో జోరుగా సాగింది. అదే ధృవనక్షత్రం చిత్రాన్ని గౌతమ్‌మీనన్ జయంరవితో తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారన్నది కోలీవుడ్ సమాచారం. ఇందులో ఇంతకుముందే ఎంపిక చేసిన నాయకిగా త్రిష, ముఖ్యపాత్రలో పార్తిబన్, అరుణ్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు.