గౌతమ్‌మీనన్ చిత్రం చేయడం లేదు: సూర్య
దర్శకుడు గౌతమ్‌మీనన్ చిత్రం నుంచి వైదొలగినట్లు సూర్య వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి గత ఏడాది జూన్‌లో అంగీకరించానని తెలిపారు. అయితే తన సినీ అనుభవం దృష్ట్యా కథ పూర్తిగా సంతృప్తినిస్తేనే షూటింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గౌతమ్‌మీనన్‌కు తెలియజేశానని వివరించారు. అందుకు ఆయన సమ్మతించిన తర్వాతే కలిసి పని చేయడానికి సిద్ధమయ్యామని తెలిపారు.
అయితే ఒప్పందం జరిగి ఏడాదైనా పూర్తి కథను తనకు సంతృప్తి కలిగేలా చెప్పలేదని పేర్కొన్నారు. సింగం-2 తర్వాత గౌతమ్ కథ కోసం ఆరు నెలలు వేచి ఉన్నానని వెల్లడించారు. తమ మధ్యనున్న స్నేహం కారణంగా చిత్ర పూజా, ఫొటోషూట్ కార్యక్రమాలకు సహకరించానని తెలియజేశారు. తర్వాత కొన్ని నెలలు షూటింగ్ లేకుండా ఖాళీగా ఉండిపోయామని వివరించారు.
ఎంతకీ గౌతమ్ నుంచి సంతృప్తికరమైన కథ లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గౌతమ్‌మీనన్, తన భావాలు విరుద్ధంగా ఉండడంతో ఇక కలసి పని చేయడం సాధ్యం కాదని భావించానన్నారు. ఒక నటుడిగా తనకు నమ్మకం లేని చిత్రాలు చేసి గుణ పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు. ఈ దృష్ట్యా గౌతమ్ మీనన్ చిత్రం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.