సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్... లుట్యెన్స్ జోన్‌లో భారీ బంగ్లా కోసం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం ఘాజియాబాద్‌లోని కౌశాంబీలో తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో నివసిస్తున్న కేజ్రీవాల్ నగరంలో అధికారిక నివాసానికి మకాం మార్చాలనుకుంటున్నారు. మహాదేవ్ రోడ్, బిషంభర్ దాస్‌మార్గ్, పండిట్ పంత్ మార్గ్‌లలోని పెద్ద పెద్ద బంగ్లాలను ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తనకు వ్యక్తిగతంగా చిన్న ఇల్లు సరిపోయినప్పటికీ ముఖ్యమంత్రిగా పనిచేయడానికి, ఇంటికి వచ్చే వారిని కలుసుకునేందుకు పెద్ద బంగ్లా అవసరమని కేజ్రీవాల్ తెలిపారు. అయితే విలాసవంతమైన బంగ్లాలో ఉండబోనని కూడా స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసం కోసం జరుపుతున్న అన్వేషణ ఓ కొలిక్కి వచ్చిందని తెలిసింది. ఆయన మధురా రోడ్‌లోని ఏడీ-17 బంగ్లాను ఎంచుకున్నారని, దానిని సిసోడియాకు కేటాయించాల్సిందిగా ఢిల్లీ సర్కారు... కేంద్ర పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరినట్లు చెబుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇందుకు ఆమోదం తెలిపితే ఈ బంగ్లా మనీష్ సిసోడియా అధికారిక నివాసం కానుంది. గత కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న ఈ బంగ్లా... ప్రస్తుతం సెంట్రల్ పూల్ కింద ఉంది.
ఈ బంగ్లాలో మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఒకప్పుడు నివసించారు. 1998లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన పుడు షీలాదీక్షిత్ ఈ ఇంటికి మకాం మార్చి ఆరేళ్లపాటు నివసించారు. ఆ తరువాత మోతీలాల్ మార్గ్‌కు మారారు. రెండు అంతస్తులున్న ఈ బంగ్లాలో రెండు లాన్లు, నాలుగు సర్వెంట్ క్వార్టర్లు ఉన్నాయి.మంత్రుల కోసం ఢిల్లీ సర్కారు ఆరు బంగ్లాలను నిర్మించింది. అయితే రాజ్‌నివాస్ వద్ద నివసించిన ఈ సువిశాలమైన బంగ్లాలో ఉండడానికి మంత్రులెవరూ ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా మంత్రులు ఈ బంగ్లాల్లో ఉండ డానికి నిరాకరించారు. 49 రోజుల పాలన సమయంలో కూడా ఆప్ మంత్రులు కూడా వాటిలో ఉండడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు కూడా ఆప్ మంత్రులకు ఈ బంగ్లాల్లో ఉండాలనే ఆలోచనేదీ లేదని అంటున్నారు.
లుట్యెన్స్ జోన్‌లో బంగ్లా కోసం కేజ్రీవాల్ అన్వేషణ
Published Mon, Feb 23 2015 10:29 PM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement
Advertisement