సీఎం సైకిల్ ర్యాలీ!
కాన్వాయ్ శ్రేణి.. అత్యున్నత స్థాయి భ్రదత.. అన్నింటినీ పక్కన పెట్టి ఎంచక్కా సైకిలెక్కి ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొననున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కాలుష్య నివారణా చర్యల్లో భాగంగా దేశరాజధానిలో మొట్టమొదటిసారి నిర్వహించనున్న 'కార్ ఫ్రీ డే' కార్యక్రమంలో కేజ్రీవాల్ ఈ ఫీట్ చేయనున్నారు. ఈ ర్యాలీలో సీఎం సహా సహచర కేబినెట్ మంత్రులూ కాళ్లకు పనిచెప్పనున్నారు.
ఢిల్లీ రవాణా శాఖ మంత్రి గోపాల్ రాయ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్ 22న ఉదయం 7 గంటలకు ర్యాలీ ప్రారంభం అవుతుందని, ఎర్రకోట నుంచి ఇండియా గేట్ వరకు కొనసాగుతుందని చెప్పారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించేలా ఆ రోజు డీటీసీ (ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్) అదనపు బస్సులు నడుపుతుందని, ఆటో డ్రైవర్లు కూడా ఉచిత సర్వీసు అందించేందుకు ముందుకొచ్చారని తెలిపారు.