'కార్లు వద్దు.. సైకిళ్లు తొక్కుదాం'
న్యూఢిల్లీ: కార్లు వద్దు.. సైకిళ్లు తొక్కడమే ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు అంటున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆయన నేతృత్వంలో గురువారం ఉదయం ఢిల్లీలో సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. హస్తినలో తొలిసారి నిర్వహించిన కారు ఫ్రీ డేలో భాగంగా ఆయన సైకిలు తొక్కారు. పాత ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ఇండియా గేటు మీదుగా మొదటి ప్రపంచయుద్ధం స్మారకం వరకు కొనసాగిన ఈ ర్యాలీలో దాదాపు వందమంది సైకిలిస్టులు పాల్గొన్నారు. కేజ్రీవాల్ మంత్రులు, అధికారులు కూడా ర్యాలీకి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ వాహనాల రద్దీ పెరిగిపోతుండటంతో ఢిల్లీ రోడ్లు ఇరుకుగా మారిపోయి.. కాలుష్యం నానాటికీ పెరుగుతున్నదని, ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రజలే ముందుకురావాలని కోరారు. ఢిల్లీ రోడ్లపై ప్రతిరోజూ 84 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. వీటివల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడమే కాకుండా కాలుష్యం వల్ల స్వచ్ఛమైన గాలి కూడా ఢిల్లీ వాసులకు లభించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ సాధ్యమైనంతవరకు వాహనాలు పక్కనపెట్టి సైకిళ్లు తొక్కాలని, ఇది తనలాంటి డయాబెటిక్ ఉన్నవాళ్లతోపాటు అందరి ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పారు.
రిజిజుగారు దేశాన్ని విభజించకండి!
ఉత్తరభారతీయులు చట్టాన్ని ఉల్లంఘించడం గర్వకారణంగా, సంతోషంగా భావిస్తారంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తప్పుబట్టారు. 'రిజిజుగారు.. భారతీయులను దక్షిణ భారతీయులు, ఉత్తర భారతీయులు, హిందువులు, ముస్లింలు అని విడదీయకండి. అందరూ భారతీయులు మంచివారే. మనం మెరుగుపరుచుకోవాల్సినది రాజకీయాలనే' అంటూ కేజ్రీవాల్ గురువారం ట్వీట్ చేశారు.