సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ బీజేపీలో చేరడం కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. అయితే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీయేనని, ఆమె నేతృత్వంలోనే స్థానిక నాయకత్వం పోటీ చేస్తుందనే భావం అంతటా బలపడిపోయింది. నిన్నామొన్నటిదాకా నరేంద్ర మోదీ మాత్రమే కనిపించిన బీజేపీ హోర్డింగులలో శుక్రవారం మార్పు కనిపించింది. మోదీతోపాటు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, కిరణ్ బేడీ చిత్రాలతో కొత్త హోర్డింగులు వెలిశాయి. బేడీకి అత్యధిక ప్రాధ్యాన్యమివ్వడమే కాకుండా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ప్రకటించడం బీజేపీకి చెందిన పలువురికి మింగుడు పడడం లేదు. అయితే ఈ విషయాన్ని బయటకు వెల్లడించడానికి వారు వెనకాడుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు అమిత్ షాలంటే ఉన్న భయభక్తులే ఇందుకు కారణం. బేడీ చే రిక వల్ల స్థానికంగా పార్టీ బలపడుతుందని ఒకవైపు అంగీకరిస్తూనే, మరోవైపు తమ అయిష్టతను పెదవి విరుపులతో ప్రకటిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టిగా కలలు కన్న రాజ్యసభ సభ్యుడు విజయ్ గోయల్ ట్వీట్‌తోపాటు వ్యాఖ్యలు ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. బేడీ ప్రేరణాపూరిత నేతృత్వాన్ని తాను అంగీకరిస్తున్నానని,ఆమె నేతృత్వంలో విజయం లభిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిని చేసినా అభ్యంతరం లేదని అంటూనే ఆమె ముఖ్యమంత్రి అవుతారా లేదా అనే విషయాన్ని పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు.
కిరణ్ బేడీ చేరిక పార్టీలో కొందరికి ఇష్టం లేకపోయినా దానివల్ల పెద్ద ప్రభావం ఉండదని, పార్టీ అధిష్టానం ఇప్పటికే కిరణ్ బేడీకి పెద్ద పీట వేశారని గోయల్ అభిప్రాయపడ్డారు. కాగా బేడీకి అధిష్టానం ప్రాధాన్యమిస్తోందనే విషయం.... విలేకరుల సమావేశానికి ఆమె అమిత్‌షాతో కలసి ఆయన కారులోనే రావడంతోపాటు హర్షవర్ధన్, ప్రభాత్ ఝా తదితర ప్రముఖ నేతలందరూ హాజరుకావడంతో తేటతెల్లమైంది. కిరణ్ బేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీజేపీ అనధికారికంగా ప్రకటించినట్లేనని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అంగీకరిస్తున్నారు. మరోవపు తనకు పనిచేయడం, పనిచేయించడం కూడా వచ్చని ప్రకటించి, 40 సంవత్సరాల పాలన అనునుభవాన్ని ఉటంకించి కిరణ్ బేడీ ముఖ్యమంత్రి పీఠంపై తనకున్న ఆకాంక్షను చెప్పకనే చెప్పారు.
ఆప్‌కు షాక్
కిరణ్ బేడీ... తమ పార్టీలో చేర్చుకోవడంద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ ఊహించని షాక్ ఇచ్చింది. స్థానికంగా బలమైన నేతలు లేనందువల్ల బీజేపీని మట్టికరిపించవచ్చనుకుంటున్న ఆప్ నేతలు తాజా పరిణామంతో ఉలిక్కిపడ్డారు. సతీష్ ఉపాధ్యాయపై చేసినంత సులువుగా కిరణ్ బేడీపై ఆరోపణలు గుప్పించలేమని ఆప్ నేతలు అంగీకరిస్తున్నారు. ఒకప్పుడు తమతో కలిసి పనిచేసిన కిరణ్ బేడీపై అంతసులువుగా ఆరోపణలు చేయలేమని వారంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ పాపులారిటీ గ్రాఫ్ ఇటీవల వేగంగా పెరగడం గమనించిన బీజేపీ...ఆయనను దెబ్బతీయాలంటే బలమైన నేత అవసరమన్న విషయాన్ని గుర్తించిందని, అందులో భాగంగానే కిరణ్ బేడీని పార్టీలోకి చేర్చుకుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రధాని మోదీ రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన ర్యాలీ విజయవంతం కావడంతో విధానసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ అధిష్టానం వేగంగా పావులు కదిపిందని వారు అంటున్నారు.
బీజేపీలో బేడీ సునామీ
Published Fri, Jan 16 2015 10:50 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement