
భయపెట్టనున్న రాయ్ లక్ష్మి
కోలీవుడ్‌లో ప్రస్తుతం హర్రర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా కథానాయకిలు దెయ్యాలుగా భయ పెడుతున్నారు. అరణ్మణై చిత్రంలో నటి ఆండ్రియ, డార్లింగ్ చిత్రంలో నందిత, కాంచన సీక్వెల్‌లో తాప్సీ ప్రజలను భయపెట్టి విజయాలు పొందారు. తాజాగా రాయ్ లక్ష్మి ప్రేక్షకులను భయ పెట్టేందుకు సిద్ధమయ్యారు. షావుకారు పేట చిత్రంలో దెయ్యంగా బీభత్సం సృష్టించనున్నారు. సాట్టై, మైనా, మోసకుట్టి వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన షాలోం స్టూడియోస్ అధినేత జాన్ మ్యాక్స్ నిర్మిస్తున్న చిత్రం షావుకారు పేట్టై.
శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రాయ్ లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను వడి వుడయాన్ నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రాయ్ లక్ష్మి పాత్ర గత చిత్రాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని దర్శకుడు చెబుతున్నారు. దెయ్యం పట్టి ఆమె ఆడటమేగాక ఇతరులను ఆడించే పాత్రను ఆమె పోషిస్తున్నారని తెలిపారు. ప్రస్తు తం తాంబరంలో షూటింగ్ జరుగుతోందని, జాన్‌పీటర్ సంగీ తం, శ్రీనివాసరెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.