
శ్రీకాంత్, లక్ష్మీరాయ్‌ల సౌకార్‌పేటై
నటుడు శ్రీకాంత్, లక్ష్మీరాయ్ సరికొత్త కాంబినేషన్‌లో సౌకార్‌పేటై అనే చిత్రం తెరకెక్కనుంది. షాలోం స్టూడియోస్ సంస్థ అధినేత జాన్‌మ్యాక్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం సౌకార్‌పేట్టై. ఎసి వడివుడైయాన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రంలో శరవణన్, వివేక్, అప్పుకుట్టి, కోటా శ్రీనివాసరావు, సంపత్, కోవై సరళ, సుమన్, సూపర్‌స్టార్ శ్రీనివాస్, నాన్‌కడవుల్ రాజేంద్రన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విసి వడివుడైయాన్ మాట్లాడుతూ చెన్నైలోని సౌకార్‌పేటై అత్యంత జనసాంద్రతగల ప్రాంతమే కాకుండా వ్యాపార సముదాయాలకు నిలయం అన్నారు.
ఆ ప్రాంతంలో జరిగే పలు ఆసక్తికరమైన సంఘటనల సమాహారమే చిత్రం అన్నారు. ఇందులో ప్రేమ, యాక్షన్, థ్రిల్లర్, హార్రర్ అంటూ పలు అంశాలు చోటు చేసుకుంటాయని దర్శకుడు చెప్పారు. సౌకారపేటై అంటే అధిక ప్రజలు, వ్యాపార సముదాయాల ప్రాంతం అనే చాలామందికి తెలుసన్నారు. అయితే ఆ ప్రాంతంలో ఒక వీధిలో దెయ్యం కథ ఒకటుందని చాలామందికి తెలియదన్నారు. ఆ ఇతివృత్తంతోనే సౌకార్‌పేటై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇందులో శ్రీకాంత్ దెయ్యమా? లక్ష్మీరాయ్ దెయ్యమా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని అన్నారు.