ఇంట్లోకి చిరుత పిల్ల
తిరువొత్తియూరు: ఇంట్లోకి వచ్చిన ఓ చిరుత పులి పిల్లను అటవీ శాఖా అధికారులు పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వాల్‌పారై, సోలయార్ ఎస్టేట్ మొదటి డివిజన్‌కు చెందిన తేయాకుతోట కార్మికురాలు ధనలక్ష్మి. శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఇంట్లో ఈమె వంట చేస్తోంది. ఆ సమయంలో వంట గదిలోకి ఓ చిరుత పిల్ల చొరబడింది. పిల్లి అనుకున్న ధనలక్ష్మి వంట చేయడంలో నిమగ్నమైంది. అయితే కొద్ది సమయం తరువాత గర్జన వినపడింది.
దీంతో దిగ్భ్రాంతి చెందిన ధనలక్ష్మి ఇరుగుపొరుగు వారికి పరిస్థితిని తెలిపింది. వీరి ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారి, ఉద్యోగులు అక్కడికి చేరుకుని ఆరు నెలల వయసున్న మగ చిరుత పిల్లను పట్టుకున్నారు. అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు. బయటకు వెళ్లే సమయంలో ఇళ్ల తలుపులకు గొళ్లెంపెట్టి ఉంచాలని అటవీ శాఖ ఉద్యోగులు ప్రజలకు సూచించారు.