విజయకాంత్ బావమరిదికి రాజ్యసభ పదవి ?
కెప్టెన్ రాజధాని రాయబారం
బీజేపీ అగ్రనేతలతో మంతనాలు
డీఎండీకే అధినేత విజయకాంత్ బావమరిది, పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ఎల్‌కే సుధీష్ త్వరలో రాజ్యసభ పదవి వరించిబోతున్నట్లు ఆ పార్టీ డిల్లీ వర్గాల భోగట్టా.
చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకేల తరువాత మూడో బలీయమైన శక్తి డీఎండీకే అవతరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని పోటీచేయడం ద్వారా పార్లమెంటులో పాగావేసేందుకు ప్రయత్నించింది. అయితే అమ్మగాలి ముందు మోదీ హవా కూడా నిలబడలేకపోవడంతో పార్లమెంటు సీటు పొందాలన్న డీఎండీకే ఆశలు అడియాసలు అయ్యాయి. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం మిత్రపక్షంగా డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఎంతో ఊరటనిచ్చింది. ప్రధానితో ఉన్న సంబంధాలను సద్వినియోగం చేసుకోవాలన్న నిర్ణయంతో రెండురోజుల క్రితం డిల్లీ విమానం ఎక్కిన విజయకాంత్ బృందం మంగళ, బుధవారాల్లో బడా నేతలను కలుసుకుంది. కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, రవాణాశాఖా మంత్రి నితిన్ గడ్కారీతో విజయకాంత్ సమావేశమయ్యారు.
అలాగే ప్రధాని నరేంద్రమోదీని సైతం కలుసుకున్న విజయకాంత్ కర్నాటక ప్రభుత్వం కావేరీపై నిర్మిస్తున్న మేఘదాతు ప్రాజెక్టు, తమిళ మత్య్సకారుల అంశం తదితర ఐదు సమస్యలను ప్రస్తావించారు. ప్రధానిని మధ్యాహ్నం, సాయంత్రం మంత్రులను కలుసుకున్నారు. పార్లమెంటు సమావేశం హాలు ప్రాంగణంలోని హోంశాఖ కార్యాలయంలో రాజ్‌నాధ్, విజయకాంత్‌ల మధ్య సంభాషణ కేవలం ఐదునిమిషాలకే ముగిసింది. ఇతర మంత్రులతో 45 నిమిషాలపాటు కెప్టెన్ గడిపారు. ప్రధాని, కేంద్ర మంత్రులను విజయకాంత్ కలుసుకున్న సందర్భంలో ఆయన భార్య ప్రేమలత, బావమరిది సుధీష్ వెంట ఉన్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ కూటమిలో కొనసాగడంపై డిల్లీ నేతల వద్ద విజయకాంత్ చర్చలు జరిపినట్లు సమాచారం. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే తరువాత బలీయమైన శక్తిగా డీఎండీకే ఎదిగిన ందున రాష్ట్రం నుంచి లేదా మరేదైనా రాష్ట్రం నుండి తమ పార్టీకి రాజ్యసభ సభ్యత్వం కేటాయించాల్సిందిగా బీజేపీ పెద్దలను విజయకాంత్ కోరినట్లు సమాచారం. తమిళనాడు నుండి రాజ్యసభకు బీజేపీ వ్యక్తిగా ఒకరు ఉండటం రాజకీయంగా మేలుచేకూరుతుందని విజయకాంత్ నచ్చజెప్పారని తెలుస్తోంది.
ఈ అంశంపై పరిశీలించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అయితే తమ కోర్కెను బీజేపీ మన్నించడం ఖాయమని డీఎండీకే గట్టి విశ్వాసంతో ఉంది. విజయకాంత్ ఆశించిందే జరిగితే డిల్లీ యాత్ర సఫలమైనట్లే.