అపోలోకు మళ్లీ వచ్చిన లండన్ వైద్యుడు రిచర్డ్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వైద్య చికిత్సలు అందించేందుకు లండన్ వైద్యుడు రిచర్డ్, ఎయిమ్స్ వైద్యుడు గిల్నాని ఆదివారం మళ్లీ అపోలో ఆస్పత్రికి వచ్చారు. వీరిద్దరితోపాటు సింగపూర్ వైద్యులు జయలలితకు కొన్ని రకాల వైద్య చికిత్సలందించారు.ఆమె అనారోగ్య సమస్యతో అపోలో ఆసుపత్రిలో చేరి నెల రోజులు దాటింది. డాక్టర్ రిచర్డ్ నేతృత్వంలో ముగ్గురితో కూడిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందం పర్యవేక్షణలో గత వారం వరకు చికిత్సలు అందిస్తూ వచ్చారు. వీరికి సింగపూర్ నుంచి ఇద్దరు మహిళా ఫిజియోథెరపీ వైద్య నిపుణులు తోడయ్యారు. దీంతో జయలలిత ఆరోగ్యం మరింత కుదుటపడ్డట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో లండన్ వైద్యుడు, ఎయిమ్స్ బృందం గత మంగళవారం వెళ్లిపోయారు. సింగపూర్‌కు చెందిన ఇద్దరు మహిళా వైద్యు నిపుణులు జయలలితకు ఫిజియో సంబంధిత చికిత్స అందిస్తూ వచ్చారు.
ఈ నేపథ్యంలో డాక్టర్ రిచర్డ్ ఆదివారం లండన్ నుంచి మళ్లీ చెన్నైకు వచ్చారు. ఆయనతోపాటు ఎయిమ్స్ ఊపిరిత్తుల సంబంధిత డాక్టర్ గిల్నాని కూడా వచ్చారు. కాగా, జయలలితను కేరళ మాజీ సీఎం ఉమన్‌చాంది, సీనియర్ నటి లత పరామర్శించారు. ఉమన్‌చాంది మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు, ఆస్పత్రి వర్గాలతో జయలలిత ఆరోగ్యం గురించి విచారించినట్టు తెలిపారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలు కావాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. నటి లత మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురైతో మాట్లాడానని, జయలలిత ఆరోగ్యం మెరుగుపడ్డట్టు చెప్పారని పేర్కొన్నారు. ఇక, అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి మాట్లాడుతూ అమ్మ ఆరోగ్యం మరింతగా మెరుగుపడిందని, త్వరలో ఇంటికి చేరుకుంటారని అన్నారు. జయలలిత క్షేమాన్ని కాంక్షిస్తూ తమిళనాడువ్యాప్తంగా ఆదివారం కూడా అన్నాడీఎంకే వర్గాలు పూజలు చేశారు. ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీ డాక్టర్ సునీల్ నేతృత్వంలో చెన్నై కీల్పాకంలోని అనాథాశ్రమంలో ప్రత్యేక ప్రార్థన జరిగింది. ఈ సందర్భంగా అక్కడి పిల్లలకు అన్నదానం చేశారు.