ధర్నా చేస్తున్న రాజేశ్వరి, పక్కన ఆమె తండ్రి
జిల్లాలోని సిరుగుప్ప తాలూకా ముద్దటనూరు గ్రామంలో ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలని కన్నడసేన ప్రేమికుడి ఇంటి ముందు బాధితురాలితో కలిసి ధర్నా చేశారు. సోమవారం ముద్దటనూరు గ్రామంలోని చంద్రప్ప కుమారుడు సంతోష్ ఇంటి ముందు అదే గ్రామానికి చెందిన బాధితురాలు కే.రాజమ్మ అలియాస్ రాజేశ్వరి, ఆమె తండ్రి తిప్పయ్య, కన్నడ సేన పదాధికారులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఏడాదిగా రాజేశ్వరిని సంతోష్ ప్రేమిస్తున్నాడని, తల్లిదండ్రుల మాట విని పరారై ఇటీవలే గ్రామానికి తిరిగి రావడంతో కన్నడ సేన హై-క వలయ ఉపాధ్యక్షుడు కే.ఎర్రిస్వామి నేతృత్వంలో సోమవారం సంతోష్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.
సంతోష్ తల్లిదండ్రులు కట్నం కోసం వేరే సంబంధం చూసి పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో కన్నడసేన సహకారంతో జూన్ 24న సిరిగేరి పోలీస్ స్టేషన్‌లో సంతోష్, చంద్రప్ప మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ జంటకు పెళ్లి చేసేంతవరకు ఈ పోరాటం ఆగదని సేన కార్యకర్తలు చెప్పారు. ఆందోళనలో కన్నడ సేన కర్ణాటక పదాధికారులు బీ.శ్రీనివాస్, జీ.సుధాకర్, పీ.బసవరాజ్, గాదెప్ప, రాఘవేంద్ర, లక్ష్మీ, అనిత, ఈరమ్మ, సయ్యద్‌బాషా, అబ్దులాజీ, రహిమాన్, గ్రామస్తులు చింతామణి, రాఘవేంద్ర, మారుతి తదితరులు పాల్గొన్నారు.