ప్రేమజంట ఆత్మహత్య | Lovers Hanged To Death In Orissa | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్య

Published Sat, Mar 31 2018 6:39 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

Lovers Hanged To Death In Orissa - Sakshi

చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న మైనర్‌ ప్రేమ జంట 

తెలిసీ తెలియని పసిమనసులు వారివి. కళ్లు..కళ్లు..కలిశాయి. మాటామాట కలిపారు. అదే ప్రేమ అనుకున్నారు. పెద్దలను ఏమార్చి ఇళ్లు విడిచి వెళ్లిపోయారు. పెద్దలకు ఆగ్రహం తెప్పించారు. పోలీసుల దర్యాప్తుతో మళ్లీ ఇళ్లకు వచ్చారు. కొద్ది రోజుల దూరాన్నే విరహ వేదన అని భావించారు. చివరికి ఆ ప్రేమజంట ప్రాణాలు తీసుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. 

జయపురం : నవరంగ్‌పూర్‌ జిల్లా ఝోరిగాం పోలీస్‌ స్టేషన్‌ పరిధి బుణువగుడ గ్రామ పంచాయతీ దేవులకోట గ్రామం సమీపంలో గల ఒక జీడి మామిడి తోటలో ప్రేమికుల జంట చెట్టుకు ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వీరిద్దరూ  దేవులకోట గ్రామానికి చెందినవారు. ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం.   వీరిద్దరికీ గత ఏడాది నుంచి పరిచయం  ఏర్పడినట్లు  తెలుస్తోంది.

ఈ విషయం తెలిసిన బాలిక తండ్రి తన కుమార్తెను మరోసారి కలవవద్దంటూ బాలుని హెచ్చరించాడు. గత ఏడాది  బాలిక పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తున్న  సమయంలో    బాలుడు ఆమెను ఎత్తుకుపోయాడు. ఈ విషయం తెలిసిన బాలిక తండ్రి ఝోరిగాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఆ  బాలుడు ఆ  బాలికను తీసుకువచ్చి  ఆమె ఇంటిలో విడిచిపెట్టాడు. ఈ కేసులో పోలీసులు  బాలుడిని అదుపులోనికి తీసుకుని జువైనల్‌ కోర్టుకు పంపారు.

రెండు నెలల కిందట  నిందిత బాలుడు తిరిగి ఇంటికి వచ్చాడు. మళ్లీ వాళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం పెరిగింది. తరువాత ఏమైందో గానీ గురువారం ఆ గ్రామ సమీపంలో గల జీడి మామిడి తోటలో ఇద్దరూ గావంచాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనపై ఇద్దరి తల్లిదండ్రులు ఝోరిగాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరుపక్షాల వారి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని  రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement