రహదారులు రక్తసిక్తం
రెండు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం
కల్వర్టును ఢీకొని...
డీజిల్ ట్యాంకు పగిలి ఎగిసిన అగ్నికీలలు
బెల్గాం జిల్లాలో మరో దుర్ఘటన...
జాతర ముగించుకుని వస్తూ ట్రాక్స్ బోల్తా - ఐదుగురి దుర్మరణం
రెండు వేర్వేరు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం
రాష్ర్టంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు. చిత్రదుర్గం జిల్లాల్లో ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. బెల్గాం జిల్లాలో జాతరకు వెళ్లి ట్రాక్స్ (క్రూజర్)లో వస్తుండగా, వాహనం అదుపుతప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన వారు నలుగురు ఉన్నారు.
చిత్రదుర్గం/చెళ్లకెర రూరల్/బెంగళూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం చెందారు. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా మేటికుర్కి వద్ద ఓ ప్రైవేట్ బస్సు రోడ్డు డివైడర్‌ను ఢీ కొనడంతో మంటలు వ్యాపించి ఆరుగురు అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. అదే విధంగా బెల్గాం జిల్లాలో ఓ ట్రాక్స్ బోల్తా పడిన ప్రమాదంలో అయిదుగురు మరణించారు. పోలీసుల కథనం మేరకు ... దావణరెరెకు చెందిన ఏపీ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సు ( కేఏ-01 సీ 7353) మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 29 మంది ప్రయాణికులతో దావణగెరె నుంచి బెంగళూరుకు బయల్దేరింది.
మూడు గంటలకు మేటికుర్కి వద్దకు చేరుకోగానే రోడ్డు పక్కన కల్వర్టును ఢీకొంది. దీంతో డీజిల్ ట్యాంక్ పగిలి క్షణాల్లో బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునే లోపే అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ప్రాణభీతితో కిటికీ అద్దాలు పగులగొట్టి కొందరు, మెయిన్ డోర్ నుంచి మరికొందరు కిందకు దూకారు. కాగా అప్పటికే మంటల్లో చిక్కుకున్న ఆరుగురు అక్కడే సజీవ దహనమయ్యారు. కిందకు దూకే సమయంలో 19 మంది గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో అదే ప్రాంతంలో ఉన్న కుమారస్వామి అనే వ్యక్తి హైవే పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందించగా పోలీసు, అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన సిరిసికి చెందిన అశ్వని, ఆమె కుమార్తె ఉదయ్ ప్రశాంత్, దావణగెరెకు చెందిన రాజ్‌కుమార్, రమేష్, గోసాబ్, అరసికెరకు చెందిన ప్రశాంత్‌బాబు, కుబేర, దుర్గేష్, ఊరి పేర్లు తెలియని ప్రశాంత్ కావళ్లి, గులాబ్ మహ్మద్, మహ్మద్ ఘోష్, మనీరా, మునీబా, నటరాజ్‌తోపాటూ మహ్మద్ ముస్తఫా, సంజయాచార్, కాశీనాథ్, మహ్మద్ శోయబ్, శ్రీప్రియా వీరిని హిరియూరు, దావణగెరె ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
కాగా సజీవ దహనమైన ఆరుగురి మృతదేహాలు గుర్తు పట్టని విధంగా కాలి బూడిద కావ డంతో వారి వివరాలు తెలియరాలేదు. అయితే మృతుల్లో ఒకరు మహిళ ఉన్నట్లు గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్ష నిమిత్తం మృతదేహాలను బెంగళూరుకు తరలించారు. ఇదిలా ఉండగా ప్రమాదం జరిగిన వెంటనే పరారైన బస్సు డ్రైవర్ ఫిరోజ్‌ను పోలీసులు హిరియూరులో అదుపులోకి తీసుకున్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేసి ఉంటే ప్రాణనష్టం తగ్గేదని ప్రత్యక్ష సాక్షి కుమారస్వామి తెలిపారు. రిజర్వేషన్ లేకుండానే ప్రయాణం : బస్సులో రిజర్వేషన్ లేకుండానే పలువురు ప్రయాణించడంతో వివరాలు లభ్యం కాక మృతులు ఎవ రనేది గుర్తించేందుకు వీలు కావడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. బస్సు దావణగెరెలో బయల్దేరిన తర్వాత నగర శివారు ప్రాంతంలో మరికొందరు ప్రయాణికులు బస్సులో ఎక్కారని, అందువల్ల వారి వివరాలు రిజర్వేషన్ చార్ట్‌లో లభ్యం కావడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు.
జాతరకు వెళ్లి వస్తూ ఐదుగురు...
బెంగళూరు : జాతరకు వెళ్లి దైవదర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా వాహనం బోల్తాపడిన ఘనటలో ఐదుగురు దుర్మరణం చెందిన సంఘటన బెల్గాం జిల్లా దోడ్డవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం రాత్రి బెల్గాం జిల్లాలోని సవదత్తిలో యల్లమ్మ జాతర జరిగింది. బెల్గాం జిల్లా ఖానాపుర తాలుకా హలసి గ్రామానికి చెందిన సురేష్ కోలార్కర్,(42), శ్యామల కోలార్కర్ (55), లక్ష్మి కోలార్కర్ (38), మారుతి కోలార్కర్ (35), రాజీవ్ మ్కాగేరి (20)తో సహ 13 మంది ట్రాక్స్ (కూసర్) వాహనంలో సవదత్తిలోని యల్లమ్మ జాతరకు వెళ్లారు.
మంగళవారం రాత్రి జాతర ముగించుకుని బుధవారం వేకువ జామున అందరూ ట్రాక్స్ వాహనంలో సొంతూరు హలసికి బయలుదేరారు. మార్గం మధ్యలో వేకువ జామున నాలుగు గంటల సమయంలో బైలహొంగల తాలుకా సుతగట్టి క్రాస్ సమీపంలో ట్రాక్స్ అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని బెల్గాం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు. నిద్రమత్తులో వాహనం నడపడం వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.