హెల్మెట్‌ ఇద్దరూ ధరించాల్సిందే..! | Madras High Court Judgement On Helmet | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ షురూ!

Published Sat, Aug 25 2018 11:40 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM

Madras High Court Judgement On Helmet - Sakshi

అవగాహన శిబిరంలో వాహనదారులు

ద్విచక్ర వాహనం నడిపే వారితో పాటు వెనుక సీట్లో కూర్చున్న వాళ్లు ఇక, హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాల్సిందే. లేని పక్షంలో జరిమానాల మోత మోగుద్ది. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంతో డీజీపీ టీకే రాజేంద్రన్‌ శుక్రవారం ఇందుకు తగ్గ ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నై మినహా తక్కిన జిల్లాల్లో ఇది అమల్లోకి వచ్చింది.

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ తప్పనిసరి అన్నది అమల్లో ఉన్న విషయం తెలిసిందే. చెన్నై వంటి నగరాల్లో కొన్ని ప్రాంతాల్ని ఎంపిక చేసిన హెల్మెట్‌ జోన్లుగా ప్రకటించారు. ఈ మార్గాల్లో  తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందే. లేని పక్షంలో  ట్రాఫిక్‌ పోలీసులు కేసుల మోత మోగించడం ఖాయం. ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘించే రీతిలో చేసిన తప్పుల్ని మళ్లీ మళ్లీ చేస్తే లైసెన్స్‌లు సీజ్‌ అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్టీఏ చట్టం మేరకు ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్లే కాదు, వెనుక కూర్చొనే వాళ్లు సైతం హెల్మెట్‌ ధరించాల్సిందేనన్న నిబంధన ఉందని, దీని అమలుకు ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కేకే రాజేంద్రన్‌ అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఈ పిటిషన్‌ విచారణ సమయంలో ప్రభుత్వానికి, పోలీసులకు చీవాట్లు తగిలించే రీతిలో హైకోర్టు తీవ్రంగానే స్పందించింది. ఈ పిటిషన్‌ మంగళవారం న్యాయమూర్తులు మణికుమార్, సుబ్రమణ్య ప్రశాంత్‌ ముందు విచారణకు రాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్లీడర్‌ రాజగోపాల్‌ ఉక్కిరి బిక్కిరి కాక తప్పలేదు. న్యాయమూర్తుల ప్రశ్నలు, ఆగ్రహానికి గురికాక తప్పలేదు. అమలు చేసే ఉద్దేశం ఉంటే చట్టాలు తీసుకు రావాలని, గాల్లోకి వదలి పెట్టేందుకు కాదంటూ తీవ్రంగానేన్యాయమూర్తులు స్పందించారు.

ఇక తప్పని సరిగా ధరించాల్సిందే: హైకోర్టు అక్షింతలు, ఆగ్రహానికి తాము గురి కావాల్సి రావడంతో పోలీసు యంత్రాంగం కదిలింది. హైకోర్టులో సాగుతున్న విచారణ, ఎదురైన పరిస్థితులు, ఆర్టీఏ చట్టంలోని అంశాలను ఎత్తి చూపుతూ, ఇక, ద్విచక్ర వాహనంలో వెనుక సీట్లో ఉన్న వ్యక్తి సైతం తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందేనని హుకుం జారీ చేశారు. రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్‌ ఆదేశాలతో అన్ని జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లకు శుక్రవారం ఉత్వర్వులు చేరాయి. ఆగమేఘాలపై ఈ ఉత్తర్వుల అమలుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందులో హైకోర్టు చేసిన హెచ్చరికల్ని వివరిస్తూ, హెల్మెట్‌ తప్పనిసరి ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మీడియా సమావేశాలు, లోకల్‌ టీవీ చానళ్ల ద్వారా ప్రజలకు ఈ విషయం త్వరితగతిన చేరే రీతిలో చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం నడిపే వారు, వెనుక సీట్లో ఉన్న వారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందేనని అవగాహన విస్తృతం చేయాలని, ధరించని పక్షంలో కేసులు, జరిమానా మోతకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెన్నై మినహా అన్ని జిల్లాలో తక్షణం ఈ ఉత్తర్వులను అమలుపరచాలని ఆదేశించారు. చెన్నైలో అమలు ఎప్పుడన్న విషయం త్వరలో ప్రకటిస్తామని డీజీపీ కార్యాలయం పేర్కొంది. చెన్నై వంటి మహానగరంలో తక్షణం అమలు పరచాల్సి వచ్చిన పక్షంలో హెల్మెట్‌ సంక్షోభం తప్పదు. ఆగమేఘాలపై డీలర్లు, విక్రయ దారులు ధరల్ని పెంచేయడం ఖాయం. వీటన్నింటిని పరిగణించి చెన్నైలో కాస్త ఆలస్యంగా హెల్మెట్‌ తప్పనిసరి అమలుకు నిర్ణయించారు. ఇక, మిగిలిన ప్రాంతల్లో అమల్లోకి రావడంతో హెల్మెట్‌ల కోసం జనాలు దుకాణాల బాట పట్టారు. దీంతో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి.

అవగాహన విస్తృతం : డీజీపీ ఉత్తర్వులతో కమిషనర్లు, ఎస్పీలు, ఇ తర అధికారులతో పాటు రెవెన్యూ, ఆర్టీఏ వర్గాలు ప్రజలకు అవగాహన కల్పించే రీతిలో విస్తృతంగా ముందుకు దూసుకెళ్లారు. చెన్నై మినహా తక్కిన జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా సాగాయి. గుమ్మిడిపూండి తాలూకా కార్యాలయంలో తహశీల్దార్‌ మదన్‌ కుప్పురాజ్‌ నేతృత్వంలో రెవెన్యూ ఉద్యోగుల సమావేశం జరిగింది. రోడ్డు భద్రత, హెల్మెట్‌ వాడకం, ట్రాఫిక్‌ నియామకాలపై రెవెన్యూ ఉద్యోగులకు అవగాహన సదస్సు జరిగింది.   తహశీల్ధార్‌ కుప్పురాజ్‌ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో జరిగే రోడ్డు ప్రమాదాలు అతివేగం, ట్రాఫిక్‌ నియమాలు పాటించకపోవడంతో జరుగుతున్నాయన్నారు.అలాగే ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్‌ పెట్టుకోకపోవడంతో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రెవెన్యూ ఉద్యోగులు ఇకనుంచి తప్పక హెల్మెట్‌ వాడాలని, అలాగే గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement