సారీ.. జోక్యం చేసుకోలేం!
సాక్షి, చెన్నై:శ్రీలంకకు దారాదత్తం చేసిన కచ్చదీవులను మళ్లీ స్వాధీనం చేసుకోవాల్సిందే నని కేంద్రంపై రాష్ర్ట ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. అసెంబ్లీలో తీర్మానాలు చేసినా, పదేపదే లేఖాస్త్రాలు సంధించినా ఫలితం మాత్రం శూన్యం. తమిళ భూభాగాన్ని గుప్పెట్లో పెట్టుకోవడమే కాకుండా, తమ మీద శ్రీలంక దాడులు చేస్తూ రావడం జాలర్లను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. కొత్త ప్రభుత్వంతోనైనా తమ జీవితాల్లో వెలుగు నిండుతుందని, కచ్చదీవుల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని భావించిన జాలర్లకు మిగిలింది కన్నీళ్లే. పారంపర్యంగా తమకు కల్పించిన చేపల వేట హక్కును కాలరాసే రీతిలో కేంద్రంలోని పాలకులు ఓ వైపు, శ్రీలంక నావికాదళం మరో వైపు వ్యవహరించడంతో జాలర్లలో ఆందోళన బయలుదేరింది.
న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కారు. పిటిషన్ : భౌగోళికంగానూ, సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత మేరకు కచ్చదీవులు భారత్ పరిధిలోనే ఉండాల్సిన అవసరం ఉందన్న డిమాండ్‌తో ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం తన గళాన్ని విప్పుతుంటే, మరో వైపు తమ హక్కులను పరిరక్షించాలంటూ మద్రాసు హైకోర్టును జాలర్లు ఆశ్రయించారు. వరుస దాడులను వివరిస్తూ, కడలిలో భద్రత కల్పించాలని, తమ హక్కులను రక్షించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ ఏడాది కాలంగా హైకోర్టులో సాగుతోంది. విచారణ సందర్భంగా కచ్చదీవుల వ్యవహారం ముగిసిన అధ్యాయం అంటూ కేంద్రం రిట్ పిటిషన్ దాఖలు చేయడం జాలర్లలో ఆగ్రహాన్ని రేపింది. అయితే, తమకు కోర్టు ద్వారా తప్పకుండా న్యాయం జరుగుతుందన్న ఆశతో ఉన్న జాలర్లకు మాత్రం చివరకు మిగిలింది నిరాశే.
జోక్యం చేసుకోం : మంగళవారం విచారణను మద్రాసు హైకోర్టు ముగించింది. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ తీర్పును వెలువరించింది. కచ్చదీవుల వ్యవహారం రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దుల సమస్యగా పేర్కొన్నారు. ఇందులో కోర్టు జోక్యం చేసుకునేందుకు వీలు లేదన్నారు. రెండు దేశాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని, ఆ దిశగా రెండు దేశాల దౌత్య అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దాడుల అడ్డుకట్ట విషయంలోను చర్చించి నిర్ణయం తీసుకోవాలని, కేంద్రం ఈ విషయంగా చర్యలు తీసుకోబోతున్న దృష్ట్యా, విచారణను ముగిస్తున్నామని ప్రకటించారు. బంతిని కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టడం నెట్టడంతో జాలర్లకు నిరాశ మిగిల్చింది. ఇక తమ పారంపర్య వృత్తిని వదులుకోవడమా లేదా, బతుకుదెరువు కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించడమా? అన్న సందిగ్ధంలో రామేశ్వరం జాలర్లు ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఈ తీర్పును వ్యతిరేకిస్తూ, అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించినా...ఫలితం దక్కేనా..! అన్నది వేచి చూడాల్సిందే!