కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టదలచిన ‘ఆహార భద్రత’ పథకాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నట్టు ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు.
సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టదలచిన ‘ఆహార భద్రత’ పథకాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నట్టు ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తుందని కాంగ్రెస్ భావిస్తున్న ఈ పథకాన్ని ఇప్పటికే ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రారంభించారు. పేదల ఆకలిని తీర్చి వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకే ఈ ఆహార భద్రత పథకాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్రంలోని డీఎఫ్ కూటమి ప్రభుత్వం పేర్కొంటోంది. ముఖ్యంగా ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని 76 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 45 శాతం మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారని అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా ప్రతి వ్యక్తికీ అయిదు కిలోల ధాన్యాన్ని అందించనున్నారు. గర్భిణులకు ఉచితంగా ఆహారం సరఫరా చేయనున్నారు.
ప్రతి నెలా 388 టన్నుల ధాన్యం సరఫరా...
ఆహారభద్రత పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించేందుకు ప్రతి నెలా సుమారు 388 టన్నుల ధాన్యం అవసరం కానుంది. దీనికిగాను ప్రతి నెలా సుమారు రూ. 800 కోట్లు అవసరమవుతాయి. ఈ పథకం అమలుచేసేందుకు అయ్యే వ్యయాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించనుందని, దీంతో రాష్ట్రంపై ఎలాంటి భారం పడదని దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ పథకం అమలులో భాగంగా కేవలం ధాన్యం నిలువ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సుమారు రూ. రెండు వేల కోట్ల వ్యయంతో గోడౌన్ల నిర్మాణం చేపట్టింది.
అదే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలోని రేషన్‌షాపుల కంప్యూటరీకరణ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. కాగా రాష్ట్రంలో తెలుపు, కేసరీ (ఆరెంజ్), పసుపు రంగు ఇలా మూడు రకాల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటన్నింటినీ త్వరలో తొలగించి ఉన్నత, మధ్యతరగతి (ప్రాధాన్యం, ప్రాధాన్యంలేని) ఇలా రెండు రకాల కార్డులు మాత్రమే జారీ చేయనున్నారు. ముఖ్యంగా బార్‌కోడ్‌లతో ఉండే రేషనింగ్ కార్డు రూపొందిస్తారు. అదే విధంగా కొత్త నియమాల ప్రకారం కుటుంబ పెద్దగా గృహిణి పేరుతో రేషన్ కార్డు జారీ చేయనున్నారు. అనంతరం పాత రేషన్ కార్డులన్నింటినీ రద్దు చేయనున్నట్టు తెలిపారు.