ముంబై: బాలికల జననరేటు ఎక్కువగా ఉన్న గ్రామాలకు ప్రభుత్వం త్వరలో రూ.5 లక్షల నజరానా ప్రకటించనుంది. అమ్మాయి పుట్టిన తర్వాత పిల్లలు వద్దు అనుకున్న కుటుంబాలకు బంగారు నాణేన్ని బహూకరించనుంది. మరో పక్షం రోజుల్లో కేబినెట్ ఆమోదానికి వెళ్లనున్న ‘మంజి కన్య భాగ్యశ్రీ’ పథకంలో ప్రభుత్వం వీటిని పొందుపరిచింది. అమ్మాయి పుట్టిన నాటి నుంచి ఐదేళ్ల వరకు రూ.2 వేలు బాలిక తల్లికి ఇవ్వనున్నట్లు పథకంలో పేర్కొంది. తర్వాత రూ.2,500 కు పెంచి 15 ఏళ్ల వరకు ఇవ్వనున్నారు. 15-18 ఏళ్ల మధ్య రూ.3,000 అమ్మాయి లేదా తల్లి అకౌంట్‌లో జమచేస్తారు.
రెండో అమ్మాయి పుడితే ఈ మొత్తంలో సగం వర్తిస్తుంది. తొలి ఐదేళ్లు రూ. వెయ్యి, 5 నుంచి 15 ఏళ్ల మధ్య రూ. 1,250, 15-18 ఏళ్ల మధ్య రూ.1,500 ఇవ్వనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు పథకం వర్తింపజేయనున్నారు.
ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపినా..
తొలుత ఈ పథకాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మహిళా శిశు సంక్షేమ మంత్రి పంకజ ముండే గత మార్చిలో ప్రకటించారు. నటి భాగ్యశ్రీని పథకానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. అయితే ఎక్కువ మొత్తంలో నిధులు అవసరమవటంతో పథకానికి ఆదిలోనే ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి.
ఆర్థిక శాఖ పలు అభ్యంతారాలు వ్యక్తం చేసినప్పటికీ.. ప్రతిపాదనను కేబినెట్ ఆమోదానికి సిద్ధం చేశారు. కాగా, బాలికల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి సుకన్య పథకంలో ప్రభుత్వం కొత్త విధానాన్ని చేర్చింది. ప్రస్తుతం ఆడపిల్ల పుడితే రూ.21,000 అమ్మాయి పేరిట ప్రభుత్వం డబ్బు జమ చేస్తోంది. దానితో పాటు రూ.లక్ష బీమాను కూడా వర్తింపజేస్తోంది. కాగా, అమ్మాయి నైపుణ్యాభివృద్ధికి పైన పేర్కొన్న సొమ్ములో కనీసం రూ.10,000 ఖర్చు చేయాలి.
ముఖ్య వివరాలు..
* బాలికల జననరేటు ఎక్కువగా ఉన్న గ్రామాలకు రూ. 5 లక్షల నజరానా
* అమ్మాయి పుట్టిన తర్వాత పిల్లలు వద్దనుకున్న కుటుంబాలకు బంగారు నాణెం
* పుట్టిన మొదటి అమ్మాయికి ఐదేళ్ల వరకు రూ. 2,000, 5-15 ఏళ్ల వరకు రూ. 2,500, 15-18 ఏళ్ల మధ్య రూ. 3,000 నెలవారీ ఖర్చులు ఇవ్వడం
* రెండో అమ్మాయికి ఐదేళ్ల వరకు రూ. 1,000, 5-15 ఏళ్ల వరకు రూ. 1,250, 15-18 ఏళ్ల మధ్య రూ. 1,500 నెలవారీ ఖర్చులు
ఆ గ్రామాలకు రూ.5 లక్షలు
Published Tue, Oct 13 2015 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM
Advertisement