అలాంటి వారి చెంప పగలగొట్టాలి: సీఎం
న్యూఢిల్లీ: మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు అడ్డుకట్ట వేయాలని, దీని కోసం రాజకీయ నాయకులు విచ్చలవిడిగా తిరిగే తమ కుమారులను హద్దుల్లో ఉంచుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. మహిళలపై ఆంక్షలు విధించే బదులు వారు స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగించారు. రాజకీయ నేతల కుమారులు ఎవరైనా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే రెట్టింపు స్థాయి శిక్షలు వేసేలా చట్టం చేయాలన్నారు.
‘‘ఈ మధ్య ఓ నేత కుమారుడు మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరో నేత మహిళలు రాత్రి వేళల్లో బయటికి రావద్దు అని సలహా ఇచ్చారు. అలాంటి వారి చెంప పగలగొట్టాలని నేను కోరుతున్నా’’అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. భారత్ తరువాత స్వాతంత్య్రం వచ్చిన దేశాలు విద్యా రంగంలో పెట్టుబడులతో అభివృద్ధి రంగంలో మనకంటే వేగంగా దూసుకుపోతున్నాయన్నారు. గడిచిన రెండేళ్లలో తమ ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉందన్నారు. పేదరికం పోవాలంటే అందరికీ విద్య అందడం ఒక్కటే మార్గమని కేజ్రీవాల్ వివరించారు.
డెంగీ, చికున్‌గున్యాను అరికట్టేందుకు సమగ్ర ప్రణాళిక
రానున్న పది రోజుల్లో ప్రభుత్వం డెంగీ, చికున్‌గున్యాల వ్యాప్తిని అరికట్టేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. జలజనిత వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుందని తెలిపారు. సరిబేసి వాహనాల నియంత్రణ కోసం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లుగానే ఢిల్లీవాసులు వ్యాధుల నియంత్రణకు సహకరించాలని ఆయన కోరారు. డెంగీ, చికున్ గున్యా వ్యాధుల నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందన్నారు.
25–30 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటు
రానున్న ఏడాది కాలంలో ప్రభుత్వం ఢిల్లీలో 25–30 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తుందని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. మొదటి సంవత్సరంలో ఈ కేంద్రాలు 25 వేలమందికి పైగా యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి పొందేటట్లు చేస్తాయని వివరించారు.భద్రత, పారిశుధ్యం అనేవి కొంతకాలానికి పరిమితమైన పనులు కావని, ఏడాది పొడవునా కొనసాగుతుందని అన్నారు. పారిశుధ్య పనుల కోసం కాంట్రాక్టు పద్దతిన ఉద్యోగులను నియమించడం సరికాదని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్యోగాల్లో కాంట్రాక్టు పద్దతిని ప్రభుత్వం అంతం చేయడానికి ప్రయత్నిస్తుందని హామీ ఇస్తూ కాంట్రాక్టులు తన పద్ధతిని సరిదిద్దుకోవాలని లేనట్లయితే వారిని సరిదిద్దుతామని హెచ్చరించారు.