నటి ప్రేమికుడి అరెస్ట్
కేకేనగర్: ఐఏఎస్ అధికారి పేరుతో కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ప్రముఖ మలయాళ నటి ప్రేమికుడిని చెన్నై కేంద్ర నేర విభాగ పోలీసులు ముంబైలో అరెస్టు చేసి చెన్నై పుళల్ జైలులో నిర్బంధించారు. చెన్నై అంబత్తూరు పారిశ్రామికవాడలో ఫ్యూచర్ టెన్నిక్స్ అనే ప్రైవేటు సంస్థను బాలసుబ్రమణియన్ నడిపేవాడు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన ఐఏఎస్ అధికారి జయకుమార్ అనే వ్యక్తి బాలసుబ్రమణియన్‌కు పరిచయం అయ్యారు. అతడు కర్ణాటక ప్రభుత్వ పథకం కింద శానిటరీ నేప్‌కిన్ తయారు చేసే ఒప్పందాన్ని కుదురుస్తానని చెప్పారు.
దీన్ని నమ్మిన బాల సుబ్రమణియన్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తన అకౌంట్ గల అంబత్తూరు కెనరా బ్యాంకు బ్రాంచ్‌లో మేనేజర్‌ను బాలసుబ్రమణియన్ సంప్రదించారు. బ్యాంకులో తాను ఐఏఎస్ అధికారి జయకుమార్ అని బాలసుబ్రమణియన్‌కు అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించడంతో బ్యాంకు రుణం ఇవ్వడానికి కెనరా బ్యాంక్ మేనేజరు జగదీష్ ఒప్పుకోవడంతో నకిలీ దస్తావేజులను సమర్పించి రూ.19 కోట్లను రుణం తీసుకున్న జయకుమార్ ఆ సొమ్ముకు జవాబుదారిగా బాలసుబ్రమణియన్ పేరు జత చేశారు.
రుణం చెల్లించకపోవడంతో దీనిపై చెన్నై కేంద్ర నేర విభాగ పోలీసులకు కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. విచారణలో ఐఏఎస్ అధికారిగా నటించి మోసం చేసిన జయకుమార్ అసలు పేరు సుకాష్ చంద్రశేఖర్ అని, అతని ప్రియురాలు మలయాళ నటి లీనా మరియాపాల్ కలిసి నకిలీ దస్తావేజులను తయారు చేసి మోసానికి పాల్పడినట్లు తెలిసింది. ఇంకనూ బాలసుబ్రమణియన్ అకౌంట్ నుంచి రూ.19 కోట్లను ముంబైలో గల బ్యాంకు అకౌంట్‌కు చంద్రశేఖర్ మార్చుకున్న విషయం వెలుగుచూసింది.
దీంతో బాలసుబ్రమణియన్, అతని భార్య, బ్యాంకు మేనేజర్ జగదీష్‌లను అరెస్టు చేశారు. ఇంకా సుకాష్ చంద్రశేఖర్‌ను ఢిల్లీనూ, అతని భార్య లీనా మరియాపాల్‌ను చెన్నై సేలయూరులో అరెస్టు చేశారు. సుకాష్ చంద్రశేఖర్‌పై ఇండియా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 25కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ముంబైలో అతడు జైలులో ఉన్నాడు. ముంబైకు వె ళ్లిన చెన్నై పోలీసులు అక్కడ జైలులో ఉన్న సుకాష్ చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. చెన్నైకు తీసుకువచ్చిన పోలీసులు అతడిని ఎగ్మూర్ న్యాయస్థానంలో హాజరు పరచి పుళల్ జైలుకు తరలించారు. త్వరలో అతడిని పోలీసు కస్టడీలో తీసుకుని విచారణ జరుపుతారు.