
కేంద్రం మౌనం వీడాలి
♦ ఎస్సీ వర్గీకరణపై మంద కృష్ణ
♦ ఐదో రోజుకు చేరిన రిలే దీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై కేంద్రం మౌనం వీడాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ మౌనం రెండు తెలుగు రాష్ట్రాల్లోని మాదిగలను తీవ్రంగా బాధిస్తోందని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. 8వ తేదీ నుంచి ఇక్కడి జంతర్ మంతర్‌వద్ద ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా గురువారం ఐదోరోజు మంద కృష్ణ మాట్లాడారు. వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి ప్రమాదకరంగా ఉందని, తేనె పూసిన కత్తిలా కేసీఆర్ వ్యవహారం ఉందని అన్నారు. 2014 నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీలో అప్పటి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య వర్గీరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని, అయితే ఆరోజు కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే అసెంబ్లీలో లేరని ఆరోపించారు.
అసెంబ్లీ తీర్మానం అనంతరం 10 సార్లు ఢిల్లీకి వచ్చిన కేసీఆర్, ఏనాడూ ప్రధాన మంత్రి వద్ద వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించలేదని, ఎమ్మార్పీఎస్ ఢిల్లీలో చేస్తున్న ఉద్యమం కారణంగానే ఆయన హడావుడిగా ప్రధానికి వినతి పత్రం ఇచ్చారని పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి మోసపూరితంగా ఉందని, ఆ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ఉద్యమాలను అణచివేయడానికి అనేక రూపాల్లో ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని భావించామని, కానీ దొరల పాలనను పునరుద్ధరిస్తున్నారని విమర్శించారు. మాజీ ఉప కులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ, మంద కృష్ణ నేతృత్వంలోనే వర్గీకరణ సాధ్యమని పేర్కొన్నారు.