భారత్ బంద్ సందర్భంగా దళిత సంఘాల నిరసన (ఫైల్)
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఆ తీర్పును రద్దు చేసేలా ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పునకు ముందున్న యథాస్థితికి ఆ చట్టాన్ని పునరుద్ధరించాలని కేంద్రం భావిస్తోంది. ఆర్డినెన్స్ జారీ ద్వారా సుప్రీంకోర్టు చేసిన మార్పుల్ని రద్దు చేసే అంశంపై ఇప్పటికే సమాలోచనలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ అంశంపై సాగుతున్న చర్చలపై ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. ‘ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా ఉద్రిక్తతల్ని తగ్గించవచ్చనే ఆలోచనలో కేంద్రం ఉంది. అలాగే సుప్రీంకోర్టు తీర్పును నిరోధించేలా జూలైలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై వేధింపుల నిరోధక చట్టం, 1989ను సవరించేలా బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది’ అని వెల్లడించాయి. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత నెల 20న సుప్రీం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆర్డినెన్స్‌తో తక్షణ ఫలితం
‘ఒకసారి ఆర్డినెన్స్ జారీ చేస్తే.. ఆ తర్వాత దానిని బిల్లు రూపంలో మార్చి పార్లమెంటు ఆమోదం పొందవచ్చు. రెండింటి ఫలితాలు ఒకటే అయినా ఆర్డినెన్స్‌తో తక్షణం ఎస్సీ, ఎస్టీ చట్టం పూర్వపు స్థితిలో అమల్లోకి వస్తుంది. ఆర్డినెన్స్‌తో వెంటనే ఫలితాన్ని పొందవచ్చు. దేశంలో కొనసాగుతున్న నిరసనల్ని నియంత్రించవచ్చు’ అని ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు చేస్తూ మార్చి 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దళిత, గిరిజన సంఘాలతో పాటు అనేక రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తీర్పును నిరసిస్తూ ఏప్రిల్ 2న దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగారనివ్వబోమని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘మనం పటిష్టంగా రూపొందించిన చట్టం ప్రభావితమయ్యేందుకు (సుప్రీంకోర్టు తీర్పు ద్వారా) అనుమతించమని మీకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఇచ్చిన తీర్పు దేశానికి తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తుందని, సమీక్షించాలని ఇప్పటికే సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరిన విషయం విదితమే.
ఇంకా నిర్ణయం తీసుకోలేదు: ప్రభుత్వం
కాగా ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఆర్డినెన్స్ జారీకి ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రివ్యూ పిటిషన్‌తో తక్షణ ఫలితం రాకపోవచ్చని, అలాగే సుప్రీంకోర్టు నిర్ణయం సానుకూలంగా ఉండకపోవచ్చని.. అందువల్ల భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందని భావిస్తున్నారు.
వ్యతిరేకంగా వస్తే ఆర్డినెన్స్: పాశ్వాన్
దళితుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం బలహీనపరిచే చర్యల్ని ప్రభుత్వం అంగీకరించబోదని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై తీర్పు వ్యతిరేకంగా వచ్చిన పక్షంలో.. ఆర్డినెన్స్‌తో పాటు పలు ప్రత్యామ్నాయాల్ని కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు.
‘తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తే.. ఆ తర్వాతి రోజే కేబినెట్ భేటీలో ఆర్డినెన్స్‌పై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన న్యాయమూర్తుల అంశంపై మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఒక్క న్యాయమూర్తి కూడా లేరు. హైకోర్టుల్లో నామమాత్రంగా న్యాయమూర్తులు ఉన్నారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment