వారాంతంలో హేమాహేమీల ప్రచారం
Published Fri, Nov 29 2013 12:32 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల నాయకులు తమదైన శైలిలో నానాతంటాలుపడుతున్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో ఈ వారాంతంతోపాటు, వచ్చే నెల ఒకటో తేదీన హేమాహేమీలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. నవంబర్ 30తోపాటు డిసెంబర్ ఒకటో తేదీన నగరంలో పలుచోట్ల పలు ర్యాలీల్లో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతోపాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి , బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ పలు సభల్లో పాల్గొననున్నారు. పశ్చిమ ఢిల్లీలో ప్రధానమంత్రి ప్రచార ర్యాలీ జరగనుంది. డిసెంబర్ 30న బీజేపీ నేత నరేంద్ర మోడీ మొత్తం ఐదు సభల్లో పాల్గొంటారు, బీహార్ ముఖ్యమంత్రి నవంబర్ 30, డిసెంబర్ ఒకటో తేదీల్లో జేడీయూ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. ఇక బీఎస్‌పీ అధినేత్రి మాయావతి మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారం చేస్తారు.రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత కాంగ్రెస్ పార్టీ తరపున 40 మంది నగరంలో ప్రచారం చేస్తారు. రాజ్‌బబ్బర్ , ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా, కేంద్రమంత్రులు సల్మాన్ ఖుర్షీద్ సచిన్ పైలట్ , మనీష్ తివారీ, జితేంద్ర ప్రసాద, సెల్జా, హరీష్ రావత్, కృష్ణాతీరథ్, ఆస్కార్ ఫెర్నాండెజ్ తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
కార్డు లేకున్నా ఓటు వెయ్యొచ్చు
వచ్చే నెల నాలుగో తేదీన జరగనున్న ఎన్నికల్లో గుర్తింపు కార్డు లేకపోయినా ఓటు వేయొచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ఓటర్ గుర్తింపు కార్డు తప్పనిసరేం కాదంటున్నారు. ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకున్నవారు, తమ ఐడీ కార్డులో తప్పులు సవరించేందుకు ఇచ్చి కొత్తకార్డులు పొందని వారు సైతం నిశ్చింతగా ఓటు వేయొచ్చని చెప్పారు. ఆయా నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో వీరి పేరు ఉంటే సరిపోతుందని, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చని సూచిస్తున్నారు. విధానసభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడంలోభాగంగా బూత్‌స్థాయి అధికారులే స్వయంగా ఇంటింటికి తిరిగి ఓటర్ల ఫొటోలతో కూడిన స్లిప్పులను పంచాల్సిందిగా అధికారులను ఢిల్లీ ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు ఆదేశించారు.ఈ స్లిప్పులను పోలింగ్ బూత్‌కి తీసుకెళ్లి ఓటు వేయొచ్చని వారు తెలిపారు.స్లిప్పులు అందని వారు సైతం దిగులు చెందాల్సిన పనిలేదని, వారికి పోలింగ్‌బూత్‌ల వద్ద ఏర్పాటు చేసే సహాయ కేంద్రాల్లో పేర్లు చెప్పి స్లిప్పులను పొందవచ్చన్నారు.
Advertisement
Advertisement