ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థినులపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం) ముందడుగు వేసింది.
ముంబై: ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థినులపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం) ముందడుగు వేసింది. ఆమ్వే ఇండియా కంపెనీ సహకారంతో నగరంలోని ఎంసీజీఎం కింద నడుస్తున్న మున్సిపల్ పాఠశాలల విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇప్పించేందుకు నిశ్చయించింది.
నమూనా ప్రాజెక్టుగా నగరంలోని రెండు పాఠశాలల్లో కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ మేరకు అవగాహన ఒప్పందంపై బుధవారం ఎంసీజీఎం, ఆమ్వే ఇండియా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, స్పోర్ట్స్ కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సంతకాలు చేశాయి. తూర్పు అంధేరిలోని ఆర్.కె.మార్గ్ మున్సిపల్ స్కూల్, చకల మున్సిపల్ స్కూల్‌లో చదువుతున్న 7వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 250 మంది విద్యార్థినులకు మొదటి దఫా శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్(విద్య) మాట్లాడుతూ..‘ ప్రస్తుత సమాజంలో మహిళలపై వేధింపులు నానాటికి పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు సర్వసాధారణమైపోయాయి.
ఇటువంటివాటిని అరికట్టాలంటే మొదట మహిళలు తమను తాము రక్షించుకునేలా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కరాటే, కుంఫూ, కిక్ బాక్సింగ్ వంటి విద్యల్లో వారికి శిక్షణ ఇస్తే ఎటువంటి విపత్కర పరిస్థితుల నైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం వారికి లభిస్తుంది.. ఈ మేరకు నగరంలోని మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న వేలాదిమంది కౌమార విద్యార్థినులకు ఆత్మరక్షణ నిమిత్తం మార్షల్ ఆర్ట్స్‌లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్ కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఎంసీజీఎం పర్యవేక్షిస్తుంది..’ అని తెలిపారు.
‘మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడమే కాక వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఈ ప్రాజెక్టును చేపట్టాం. బాలికల భవిష్యత్తును కాపాడటం మన నైతిక బాధ్యత. ఈ బృహత్తర కార్యక్రమంలో ఆమ్వే ఇండియా సహకారం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం..’ అని ఆయన కంపెనీ ప్రతినిధులను అభినందించారు. ‘ఆమ్వే వంటి కంపెనీలు సహకారం ఇలాగే ఉంటే మున్ముందు ఎంసీజీఎం మహిళల, బాలికల రక్షణకు మరిన్ని కార్యక్రమాలను చేపట్టేందుకు అవకాశం ఉంటుంది..’ అని అసిస్టెంట్ కమిషనర్ (ప్లానింగ్ ) ప్రాచి జంభేకర్ అన్నారు.
ఆమ్వే ఇండియా పశ్చిమ విభాగ అధికారి సందీప్ ప్రకాశ్ మాట్లాడుతూ బాలికల రక్షణ కార్యక్రమంలో పాలుపంచుకోవడం బాధ్యతగా గుర్తించి తమ కంపెనీ ఎంసీజీఎంతో అవగాహనకు వచ్చిందని తెలిపారు. ‘ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో మేం కూడా పాలుపంచుకోవడం గర్వంగా ఉంది. నేడు మహిళలు అన్నివిధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వారికి సమాజంలో రక్షణ మృగ్యమైపోతోంది. ఏ రంగంలోనూ వారు పురుషులతో సమానంగా హక్కులను పొందలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మా సంస్థలో 60 శాతానికి పైగా పంపిణీదారులు మహిళలేనని చెప్పడానికి గర్వపడుతున్నాను.
భవిష్యత్తులో మహిళలు స్వయంసమృద్ధి సాధించడమేకాక తమను తాము రక్షించుకునేవిధంగా వారికి తగిన రక్షణ, శిక్షణ కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది..’ అని సందీప్ అన్నారు. ఇదిలా ఉండగా ఎంసీజీఎంలోని సామాజిక బాధ్యత విభాగం నగరంలో విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మహిళా రక్షణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా ఏర్పడింది. దీనికి ఎటువంటి నిధుల కేటాయింపు లేకపోయినా, వివిధ సంస్థల సహకారంతో కార్యక్రమాలను చేపడుతోంది.