అర్ధరాత్రి దాకా దుకాణాలు | mayor gave permission to open shop upto mid night on the occassion diwali | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి దాకా దుకాణాలు

Published Fri, Oct 25 2013 12:52 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM

mayor gave permission to open shop upto mid night on the occassion diwali

సాక్షి, ముంబై: దీపావళి పర్వదినం పురస్కరించుకుని కొనుగోలుదార్ల సౌకర్యార్థం అర్ధరాత్రి వరకు షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతి కల్పిస్తున్నట్లు మేయర్ సునీల్ ప్రభు ప్రకటించారు. ఈ ప్రకటనతో ఇటు ముంబైకర్లతో పాటు దుకాణ యజమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. గడియారంలోని ముల్లులాగా ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకులు పరుగులు తీసే ముంబైకర్లకు పండుగలు వస్తే షాపింగ్ చేయడానికి సమయం దొరకదు. సాధారణంగా ముంబైలో రాత్రి  తొమ్మిది గంటల వరకు షాపులన్నీ మూసివేస్తారు. రోడ్లపై అక్రమంగా వ్యాపారంచేసే హాకర్లు మినహా లెసైన్స్ షాపులన్ని బీఎంసీ నిర్ధేశించిన సమయానికే మూసివేస్తారు. కానీ ఉత్సవాల సమయంలో టపాకాయలు, మిఠాయి, దుస్తులు విక్రయించే షాపుల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. అయినప్పటికీ బీఎంసీ సూచించిన సమయానికి షాపులు మూసివేయక తప్పడం లేదు.
 
  సమయం లేక కొనుగోలు చేయడానికి వచ్చిన నగరవాసులను ఖాళీ చేతులతో తిరిగి పంపిస్తున్నారు. విధులు ముగించుకుని షాపింగ్‌కు వచ్చిన ఉద్యోగులు వివిధ వస్తు సామగ్రిని కొనుగోలు చేయడానికి కొన్ని షాపుల బయట క్యూ కడుతుంటారు. కానీ సమయం మించిపోవడంతో మరుసటిరోజు రావాలని షాపు యజమానులు చెప్పి పంపిస్తుంటారు. వీటిని దృష్టిలో ఉంచుకుని దీపావళి సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తున్నట్లు ప్రభు ప్రకటించారు. దీనిపై నగర పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్‌తో ఫోన్‌లో సంప్రదించారు. షాపులు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడం వల్ల శాంతిభద్రతల ఇబ్బందులు తలెత్తుతాయా అనే దానిపై చర్చించారు.ఇందుకు సింగ్ సానుకూలంగా స్పందించారు. అన్ని పోలీసుస్టేషన్‌లకు సర్క్యులర్ జారీ చేశారు. ఉత్సవాల సందర్భంగా అర్థరాత్రి వరకు షాపు తెరిచి ఉంచిన యజమానులపై ఎలాంటి చర్యల తీసుకోరాదని సింగ్ స్పష్టం చేశారు.  
 
 స్వీట్లపై వెండి కాగితం నిషేధం: బీఎంసీ మిఠాయిలపై ఏర్పాటుచేసే పల్చని వెండి కాగితాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆరోగ్య శాఖ నిషేధించింది. అయితే కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు మిఠాయిలపై వెండి కాగితాన్ని ఏర్పాటు చేస్తున్న తయారీదారులకు ఈ నిర్ణయం రుచించడం లేదు. ఈ సన్నని కాగితాన్ని తినడంవల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్య రంగంలో ఉన్న నిపుణులు నిర్ధారించారు. దీంతో మిఠాయిలపై ఇలాంటి తాపడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు మేయర్ సునీల్ ప్రభు సర్క్యులర్ జారీ చేశారు. దీన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు పోలీసులు సహకరించాలన్నారు.

ఈ విషయాన్ని నగర పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్‌తో స్వయంగా భేటీ అయి చర్చించానని తెలిపారు.  వ్యాపారులపై చర్యలు తీసుకునే సమయంలో బీఎంసీ అధికారులకు తోడుగా పోలీసులు ఉంటారని ఆయన హామీనిచ్చారన్నారు. కాగా, సాధారణంగా మిఠాయి షాపుల్లో విక్రయించే వివిధ బర్ఫీ, హల్వ తదితర ఖరీదైన స్వీట్లపై తెల్లని వెండి కాగితం అలంకరించి ఉంటుంది. అది కొనుగోలుదార్లను ఆకట్టుకుంటుంది. ఇలాంటి మిఠాయిలపై వాటిని అందంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా కొందరు కార్మికులు ఉంటారు. కానీ మిఠాయితోపాటు వెండి కాగితాన్ని తినడంవల్ల అది ఆరోగ్యానికి చేటు చేస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. ఈ మేరకు బీఎంసీ ఆరోగ్య శాఖ ఆ కాగితంపై నిషేధం విధించింది.  దీనివల్ల ఈ పనిపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి గండిపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement