వైద్య విద్యార్థులపై జలఫిరంగులు
Published Fri, Aug 9 2013 2:15 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
న్యూఢిల్లీ: ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో ఆందోళనకు దిగిన వైద్య విద్యార్థులపై పోలీసులు జలఫిరంగులతో విరుచుకుపడ్డారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్ష రాయాలంటే కనీసం ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైద్య విద్యార్థులు మొదట జంతర్‌మంతర్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఎయిమ్స్, వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీ, సఫ్దర్‌జంగ్ ఆజాద్ మెడికల్ కాలేజీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్, లేడీ హార్డింగే మెడికల్ కాలేజీ, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ తదితర కళాశాలలకు చెందిన వందలాది విద్యార్థులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు ముందే గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించాలనే పద్ధతిని అమలు చేయాలనుకుంటే అది విద్యార్థుల ఇష్టానికే వదిలేయాలని కోరారు. అంతేగానీ అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు అర్హతగా పరిగిణించరాదన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ డిమాండ్లను తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.వందలాదిగా విద్యార్థులు పాల్గొన్న ఈ ప్రదర్శనపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఓ సమయంలో విద్యార్థులు సహనాన్ని కోల్పోయారు.
జంతర్‌మంతర్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో జలఫిరంగులను ప్రయోగించారు. అనంతరం విద్యార్థుల తరఫున మెడికోలకు చెందిన బృందం నాయకుడు కేశవ్ దేశిరాజు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శిని కలిశారు. తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎటువంటి సౌకర్యాలు ఉండవని, కనీసం ల్యాబ్ సౌకర్యం కూడా ఉండదని, అలాంటి పరిస్థితుల్లో ఎలా శిక్షణ పొందుతారని ప్రశ్నించారు.
Advertisement