పోలవరం పూర్తికి అన్ని చర్యలు : దేవినేని
పోలవరం కుడి కాల్వను ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌తో కలిసి మంత్రి దేవినేని ఉమ పరిశీలించారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం జానంపేట వద్ద పోలవరం కుడి కాల్వను ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌తో కలిసి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును అనుకున్న ప్రకారం 2018కు పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రాజెక్టు వద్ద వారానికి 14 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించాల్సి ఉండగా 12 లక్షల వరకు తరలిస్తున్నట్లు తెలిపారు.
పట్టిసీమ ద్వారా ఈ ఖరీఫ్‌లో 45 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని, 10.74 లక్షల ఎకరాల పంట పొలాలతో పాటు లక్షా 50 వేల ఎకరాల చేపల చెరువులకు సాగునీరందించామని వివరించారు. కాగా, ఎన్‌టీఆర్ కల అయిన తెలుగుగంగను 2017 నాటికి పూర్తి చేస్తామని మంత్రి దేవినేని చెప్పారు. పట్టిసీమ స్ఫూర్తితో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కూడా త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీరి వెంట ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్, ఈఈ చినబాబు తదితరులు ఉన్నారు.