కాఫర్ డ్యాంకు అనుమతి లేదు
- డిజైన్ల సమీక్షా కమిటీతో చర్చించి ముందుకెళ్తున్నాం
- జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాఫర్ డ్యాం నిర్మాణానికి కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి లేదని, ఇకపై తీసుకోవాల్సి ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. డిజైన్ల సమీక్షా కమిటీకి తమ ప్రతిపాదనలన్నీ సమర్పించి చర్చించాకే దీనిపై ముందుకెళ్తున్నామన్నారు. ‘మట్టికట్టతో కనికట్టు’ శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీడబ్ల్యూసీ డిజైన్లకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టును చేపడతామన్నారు.
జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ) వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు మెయిన్ డ్యాంకు సంబంధించి 1983లో ప్రతిపాదించిన ఒరిజినల్ డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. కాఫర్ డ్యాం అంటే తాత్కాలిక కట్టడమేనని, ఈ ప్రాజెక్టులో దాన్ని క్రస్ట్ లెవెల్‌ను 41 మీటర్లకు పెంచి కాఫర్ డ్యాంను నిర్మిస్తున్నామని, తద్వారా 28 లక్షల క్యూసెక్కుల నీటిని మళ్లించే అవకాశం ఉందన్నారు. మెయిన్ డ్యాం పూర్తయ్యాక ఈ డ్యాంను తొలగిస్తామన్నారు. కాఫర్ డ్యాంలో 60 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందన్నారు. జలవనరుల శాఖ చరిత్రలో కాఫర్ డ్యాంను ప్రధానంగా చేపట్టిన సందర్భాలెక్కడైనా ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు మంత్రి దేవినేనిగానీ, ఈఎన్‌సీ గానీ సూటిగా సమాధానం చెప్పలేదు.