ప్రాజెక్ట్‌ ఫలాలు వీలైనంత త్వరగా అందించాలి: సీఎం జగన్‌ | YS Jagan Mohan Reddy Review Meeting With Water Resources Department | Sakshi
Sakshi News home page

జలవనరుల శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

Published Fri, May 28 2021 3:43 PM | Last Updated on Fri, May 28 2021 8:28 PM

YS Jagan Mohan Reddy Review Meeting With Water Resources Department - Sakshi

సాక్షి, తాడేపల్లి: జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిపై అధికారులతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. 91 శాతం స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయని.. జూన్‌ 15 నాటికి మిగిలిన పనులు పూర్తిచేస్తాం అని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరుకు స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తవుతాయని వెల్లడించారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీలను పూర్తిచేశామని.. జూన్‌ నెలాఖరుకు కాఫర్‌ డ్యామ్‌లో 1, 2 రీచ్‌లు పూర్తవుతాయన్నారు అధికారులుజులై ఆఖరుకు కాఫర్‌ డ్యామ్‌ 3, 4 రీచ్‌ పనులు నిర్ణీత ఎత్తుకు పూర్తి అవుతాయని తెలిపారు. దిగువ కాఫర్‌ డ్యాం పనులు కూడా వేగవంతం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం సమీక్ష
కేంద్రం నుంచి రావాల్సిన పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. 1600 కోట్ల రూపాయల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు సీఎం. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ.. ‘‘పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తిచేయాలనే తలంపుతో ఉన్నాం. అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా డబ్బులు ఇస్తున్నాం. ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాలనే తపనతో ఉన్నాం. ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా.. ప్రాజెక్టు పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాం అని సీఎం జగన్‌ తెలిపారు. 

‘‘రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన ఖర్చుకు సంబంధించి ..కేంద్రంలో బిల్లులు పెండింగులో ఉండడం సరికాదు . అధికారులు వెంటనే దీనిపై దృష్టిపెట్టాలి
చేసిన ఖర్చు వెంటనే రీయింబర్స్‌ అయ్యేలా చూడాలి. వచ్చే మూడు నెలలకు కనీసం 1400 కోట్ల రూపాయలు ఖర్చు అని అధికారులు చెప్తున్నారు. ఢిల్లీ వెళ్లి పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ అయ్యేలా చూడాలి’’అని సీఎం జగన్ ఆదేశించారు. 

నేరడి బ్యారేజీ నిర్మాణంపై సమీక్ష
వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నేరడి బ్యారజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే చర్చలకు ఒడిశా సీఎస్‌కు లేఖరాశామని..వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్న సీఎస్‌ ఆదిత్యనాథ్‌.. త్వరలోనే నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశాతో మాట్లాడతామని సీఎస్‌ తెలిపారు. 

జూలై 31 నాటికి నెల్లూరు బ్యారేజీ నిర్మాణం
నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జూలై 31 నాటికి పూర్తవుతుందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. సంగం బ్యారేజీ పనులు 84 శాతం పూర్తయ్యాయని.. జులై 31 నాటికి మొత్తం పనులు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. అవుకు టన్నెల్‌లో రెండువైపుల నుంచి పనులు చేస్తున్నామని..  ఇంకా 180 మీటర్ల పని ఉందని..వచ్చే 3 నెలల్లో పనులు పూర్తిచేయగలుగుతామని అధికారులు సీఎంకు తెలిపారు. 

వెలిగొండ ప్రాజెక్ట్‌పై సీఎం సమీక్ష
వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్ ‌–1 పూర్తిగా సిద్ధమైందన్న అధికారులు.. టన్నెల్‌ –1 హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు కూడా దాదాపుగా పూర్తియ్యాయన్నారు. టన్నెల్‌ –2 పనులు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పనులు ఆలస్యంకాకుండా, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న సీఎం.. రెండో టన్నెల్‌ పనుల్లో కచ్చితంగా పురోగతి కనిపించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వచ్చే సమావేశానికి కార్యాచరణ ప్రణాళికతో రావాలని తెలిపారు. 

వంశధార స్టేజ్‌ 2, ఫేజ్‌ 2 పనులపైనా సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వీటిని ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా తీసుకున్నామని.. పనులు ఆలస్యంకావడానికి వీల్లేదన్నారు. పనులు వేగంగా నడవాల్సిన అవసరం ఉందన్నారు. వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు సత్వరమే పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

బ్రహ్మసాగర్, పైడిపాలెం ప్రాజెక్టుల మరమ్మతులను సత్వరమే చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. బ్రహ్మసాగర్‌ సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో నిల్వచేయడానికి.. అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలానే రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులు.. గోదావరి కృష్ణా సలైనటీ మిటిగేషన్‌, వాటర్‌ సెక్యూరిటీ ప్రాజెక్టులు.. పల్నాడు ప్రాంత కరువు నివారణా ప్రాజెక్టులు..ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement