‘చంద్రబాబు సలహా తీసుకుంటే బాగుండేది’
అమరావతి: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుపై నిర్ణయానికి ముందు దేశంలోనే అత్యంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు లాంటి వారి సలహాలు తీసుకుని ఉంటే ఇపుడు ఇబ్బందులు తలెత్తేవి కాదని ఏపీ వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. కేంద్రం నిర్ణయం తీసుకోవాలనుకున్నపుడు రహస్యంగానైనా సూచనలు, సలహాలు తీసుకుని ఉండాల్సిందని చెప్పుకొచ్చారు. ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకపోవటం వల్లే ప్రజలు నోట్ల రద్దు అనంతరం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సోమవారం విజయవాడలో మంత్రి విలేకరులతో మాట్లాడారు.
నోట్ల రద్దు వల్ల అన్ని రంగాలకు చెందిన వారు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన చంద్రబాబు బ్యాంకు అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించటంతో పాటు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా పార్టీకి లాభమా, నష్టమా అన్నది డిసెంబర్ తరువాత తెలుస్తుందన్నారు.