
మంత్రులే కమీషన్లు అడుగుతున్నారు
సీఎం ముందు వాపోయిన స్వపక్ష ఎమ్మెల్యేలు
నియోజకవర్గంలోని పనులకు కూడా ఇవ్వాలంటా!
పర్సెంటేజ్‌లు నిర్ణయించి మరీ డిమాండ్ చేస్తున్నారు
రామనాథ్ రై వైఖరిపై ఎమ్మెల్యే శకుంతలా శెట్టి కన్నీరు
సువర్ణసౌధ సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ లుకలుకలు
బెంగళూరు : అధికార పార్టీ, మంత్రులపై ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేయడం సహజం. అయితే మంత్రులపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శలు గుప్పించడం అరుదు. ఈ విషయంలో కాంగ్రెస్ టాప్‌ని చెప్పవచ్చు. ఈ విషయం మరోసారి రుజువైంది. ‘మా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి కూడా మంత్రులు కమీషన్లు అడుగుతున్నారు. కొందరైతే ఏకంగా పర్సెంటేజ్‌లు నిర్ణయించి మరీ కమీషన్లు అడుగుతున్నారు. అంతేకాదు అధికారుల బదిలీలు, నిధుల విడుదల ఇలా అన్ని విషయాల్లోనూ మంత్రులకు కమీషన్లు చెల్లించాల్సి వస్తోంది. ఇక మా నియోజకవర్గ పరిధిలోని కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా మంత్రులే కలగజేసుకుంటుంటే ఇక మేమెందుకు?’ అని బెళగావిలోని సువర్ణసౌధలో బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ముందు వాపోయారు.
బెళగావిలో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గాను బుధవారం కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశాన్ని (సీఎల్‌పీ) ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రుల వైఖరిపై తమకు ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇక ఈ సందర్భంలో ఎమ్మెల్యే సోమశేఖర్ మంత్రుల పనితీరుపై భగ్గుమన్నట్లు సమాచారం. ‘ఈ మంత్రులకు కాంగ్రెస్ సంస్కృతి తెలియడం లేదు. అందుకే వీరికి కాస్తంత కాంగ్రెస్ సంస్కృతి నేర్పండి. ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయడం నేర్పండి’ అని పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక మరో ఎమ్మెల్యే మాలికయ్య గుత్తేదార్ కూడా మంత్రుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘ప్రభుత్వ ఇంజిన్(సీఎం) బాగానే ఉంది. అయితే ఇందులోని కొన్ని పెట్టెలు(మంత్రులు) సరిగా పనిచేయడం లేదు. వీటిని మార్చేంతవరకు ప్రభుత్వానికి మంచి పేరు రాదు’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కన్నీరుపెట్టిన శకుంతలా శెట్టి...
ఇక శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యే శకుంతలా శెట్టి కన్నీరుపెట్టినట్లు సమాచారం. ‘నా నియోజకవర్గ పరిధిలోని అన్ని విషయాల్లోనూ మంత్రి రామనాథ్ రై జోక్యం చేసుకుంటున్నారు. ఈ కారణంగా అధికారులెవరూ అసలు నా మాట వినడం లేదు. ఇలాంటి సందర్భంలో మేమెలా పనిచేయగలం’ అంటూ శకుంతలాశెట్టి కన్నీరుపెట్టుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.