వాగులో కొట్టుకుపోయిన తల్లీకూతుళ్లు
తల్లి మృతదేహం లభ్యం
కొప్పళ జిల్లాలో విషాదం
సాక్షి, బళ్లారి :
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొప్పళ జిల్లా కుష్టగి తాలూకా బొమ్మనాళ గ్రామం వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులో తల్లీకూతుళ్లు గల్లంతయ్యారు. శనివారం సాయంత్రం పొలం పనులకు వెళ్లిన హెగ్గప్ప, అతని భార్య హనుమవ్వ(45), కుమార్తె పార్వతి(22), కుమారుడుతోపాటు ఎద్దుల బండిపై వస్తుండగా గ్రామ శివార్లలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఎద్దులబండి బోల్తా పడింది. హెగ్గప్ప, అతని కుమారుడు ఈదుకుంటూ గట్టుకు చేరగా తల్లీకూతుళ్లిద్దరూ వాగులో కొట్టుకుపోయారు. వారి ఆచూకీ కోసం రాత్రంతా వాగు వెంట తీవ్రంగా గాలించారు. ఆదివారం ఉదయం హనుమవ్వ మృతదేహాన్ని వెలికితీశారు. అయితే పార్వతి ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ఆమె మృతదేహం ఆచూకీ కోసం పోలీసులతో పాటు సంబంధిత అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఇటీవలే కూతురికి వివాహం..
వాగులో కొట్టుకుపోయిన పార్వతికి రెండు నెలల క్రితమే వివాహమైంది. భర్త బసవరాజు సైన్యంలో విధులు నిర్వహిస్తున్నారు. బసవరాజు ఇటీవలే విధుల కోసం జమ్ముకశ్మీర్‌కు వెళ్లడంతో పార్వతి పుట్టింటికి చేరింది. తల్లిదండ్రులతో పాటు పొలం పనులకు వెళ్లగా వాగులో గల్లంతైంది. ఘటనతో బొమ్మనాళ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై హనుమసాగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.