కొడుకుని చంపి రోజుకో అవయవం నరికేసింది!
- దీర్ఘకాలిక వ్యాధికి చికిత్స కోసం పొలం అమ్ముకున్నాడనే కోపంతో హత్య
- మృతదేహాన్ని గోనె సంచిలో ఆరు రోజులుగా ఇంటి పక్కనే దాచారు
- మృతదేహం నుంచి రోజుకో అవయవం నరికేస్తున్న వైనం
- బుధవారం రాత్రి తల నరుకుతుండగా గుర్తించిన స్థానికులు
- గుంటూరు జిల్లా బోడిపాలెంలో ఘటన
కాకుమాను (గుంటూరు) : అమ్మను మించిన దైవం లేదంటారు. అయితే నవమాసాలు మోసిన ఓ తల్లే తన కుమారుడిని కడతేర్చింది. కొడుకు మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి ఆరు రోజుల పాటు ఇంటి పక్కనే దాచింది. అంతటితో ఆగకుండా ఉన్మాదిలా మారి కొడుకు మృతదేహం నుంచి రోజుకో అవయవాన్ని నరికేస్తోంది. రెండురోజుల క్రితం మృతదేహం నుంచి చెయ్యిని వేరుచేసి సంచిలో పెట్టింది. బుధవారం రాత్రి తల నరుకుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది.
గుంటూరు జిల్లా కాకుమాను మండలం బోడిపాలెంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. బోడిపాలెం గ్రామానికి చెందిన బత్తినేని అంజనాదేవి (60)ని ఆరేళ్ల క్రితం భర్త వదిలి వెళ్లిపోయాడు. ఆమెకు కుమారుడు కోటేశ్వరరావు (40)తోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి కుమారుడుతో కలిసి బోడిపాలెం గ్రామంలో ఉంటోంది. కోటేశ్వరరావుకు 2004లో పొన్నూరు మండలం నిడుబ్రోలుకు చెందిన శైలజతో వివాహం జరిగింది. వీరి వైవాహిక జీవితం ప్రారంభంలో అన్యోన్యంగా సాగింది. అయితే కోటేశ్వరరావుకు ప్రాణాంతక వ్యాధి ఉందని తెలిసి భార్య శైలజ పుట్టింటికి వెళ్లిపోయింది.
కొన్ని నెలలు క్రితం పెద్దల సమక్షంలో ఇద్దరు కలిసి ఉండేందుకు అంగీకరించారు. ఈ మేరకు కలిసి ఉంటూ కోటేశ్వరరావు వ్యాధి నివారణ కోసం తెనాలిలో వైద్యం చేయించుకుంటున్నారు. కోటేశ్వరరావు పేరున ఉన్న 1.67 ఎకరాల భూమిని ఇటీవల విక్రయించారు. ఆ డబ్బును వైద్యం కోసం, ఇంటి ఖర్చులకు ఉపయోగిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన దసరా పండుగ కావటంతో భార్య శైలజతో కలసి అతను అత్తగారి ఇంటికి నిడుబ్రోలు వెళ్లారు.
ఇదీ వివాదం...
భార్య శైలజను పుట్టింట్లో వదిలి ఈ నెల12వ తేదీన బోడిపాలెం గ్రామం చేరుకున్న కోటేశ్వరరావు తన తల్లి పేరు మీద ఉన్న 3.23ఎకరాల భూమిలో అర ఎకరం విక్రయించి డబ్బులు ఇవ్వాలని కోరారు. ఈ విషయమై తల్లి అంజనాదేవితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అంజనాదేవి అదే గ్రామంలో నివాసం ఉంటున్న తన సోదరుడు గార్లపాటి నాగేశ్వరరావు, అంగలకుదురులో ఉంటున్న కుమార్తె ముప్పవరపు నాగలక్ష్మిలకు ఫోన్ చేసి పిలిపించుకుంది. కొడుకుతో ఆస్తి వివాదం గురించి చెప్పింది. ముగ్గురు కలిసి కోటేశ్వరరావును హతమార్చాలని పథకం రచించారు.
ఇలా హతమార్చారు..
పథకం ప్రకారం ఈ నెల 13వ తేదీ రాత్రి అంజనాదేవి, నాగేశ్వరరావు, నాగలక్ష్మి కలిసి కోటేశ్వరరావును తలపై బలమైన ఆయుధంతో మోది హతమార్చారు. మృతదేహాన్ని సంచిలో చుట్టి ఇంటి పక్కనే ఉంచారు. శైలజకు తన భర్త నుంచి ఎలాంటి ఫోన్‌లు రాకపోవటంతో గత శుక్రవారం బోడిపాలెం వచ్చి అత్తను అడగగా... నెల్లూరు వెళ్లాడని, వారం పది రోజుల తర్వాత వస్తానని చెప్పాడని నమ్మబలికింది.
అయితే ఇంట్లో దుర్వాసన రావటం గ్రహించి శైలజ తన అత్తను నిలదీయటంతో.. ఇంటి పక్కన పందికొక్కులు చచ్చాయంటూ దాటవేసింది. ఎక్కువసేపు తన కోడలు ఇంట్లో ఉంటే విషయం బయటపడుతుందని గ్రహించి తాను అర్జంటుగా గుంటూరు వెళ్లాలని, శైలజను పుట్టింటికి పంపింది. ఇంటిలో కొడుకు ఫొటోలు, ఆధార్‌కార్డులు మాయం చేసింది. అప్పటినుంచి అంజనాదేవి ఉన్మాదిలా మారి కుమారుడి మృతదేహంలోని అవయవాలను ఒక్కొక్కటి కత్తితో నరికి గోనె సంచిలో ఉంచుతోంది.
వెలుగులోకి వచ్చిందిలా...
బుధవారం రాత్రి అంజనాదేవి మృతదేహం నుంచి తలను వేరుచేస్తుండటంతో (కత్తితో నరుకుతున్న సమయంలో) పెద్దగా శబ్దం, దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పొన్నూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించారు. సీఐ సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అంజనాదేవి, నాగలక్ష్మిలను అదుపులోకి తీసుకున్నారు. నాగేశ్వరరావు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొన్నూరు ప్రజావైద్యశాలకు తరలించారు. మృతునికి సంతానం లేరు. కేసును కాకుమాను ఎస్‌ఐ ఎల్.లోకేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు.