
బరంపురం: రాష్ట్రంలో సినిమా హాళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ఒకప్పుడు దక్షిణ ఒరిస్సాలో కేంద్ర బిందువైన బరంపురంలోని సినిమా హాళ్లలో చిత్ర ప్రదర్శనలు మూడు పువ్వులు, ఆరు కాయల్లా లాభసాటిగా ఉండేవి. కానీ ప్రస్తుతం టీవీ సీరియల్స్, పైరసీతో పాటు యూ ట్యూబ్ ప్రభావం వల్ల సినిమా హాళ్లు కష్టాల బాటలో నడుస్తుండడంతో నష్టాలు చవిచూస్తున్న థియేటర్ల యజమానుల పరిస్థితిగా అధ్వానంగా మారింది.
రాష్ట్రంలో మొట్ట మొదటిగా బరంపురంలో 1927లో ఎస్‌ఎస్‌వీటీ థియేటర్‌ను ఆత్మకూరి వంశీకులు ప్రారంభించారు. అప్పట్లో మాటలు లేని మూకీ(మూగ) చిత్రాలు ప్రదర్శించేవారని పూర్వీకులు చెబుతున్నారు.
నాలుగు కేటగిరీల్లో పన్ను వసూలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నాలుగు కేటగిరీలుగా టాక్స్‌ను విభజించింది. కార్పొరేషన్ పరిధిలో గల హాల్‌కి 25 శాతం, మున్సిపాల్టీ పరిధిలో గల హాల్‌కి 20 శాతం, ఎన్‌ఏసీ పరిధిలో 10 శాతం, పంచాయతీ పరిధిలో గల హాల్‌కు 5 శాతం వినోదపు పన్ను వసూలు చేస్తోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోయింది. ఒరియా చిత్రాలకు అదరణ పెరగడం, ఒరియా చిత్రాల నిర్మాణం తక్కువ బ డ్జెట్ కావడంతో ఒరియా చిత్రాలు కాస్త లాభసాటిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ రుణాలతో థియేటర్లు నిర్మించి నడిపిస్తే కొన్నాళ్లకు మూసేయక తప్పదని యజమానులు చెబుతున్నారు. దీనికి తోడు ఒరిస్సా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కూడా రాష్ట్రంలో గల సినిమా హాళ్లను అదుకోకపోవడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో 200 సి నిమా హాళ్లలో 120కి పైగా మూతపడినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో వినోద పన్ను చాలా తక్కువగా ఉంటే ఒరిస్సా రాష్ట్రంలో 25 శాతం పన్ను వసులు చేయడంతో తమపై భారం పడుతుండడంతో చేసేది లేక సినిమా హాళ్లు మూసివేస్తున్నట్లు థియేటర్ల యజమానులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు నగరంలో కొంతకాలంగా శాంతి భధ్రతలు కరువవడంతో అడియన్స్ సెకెండ్ షోకు రాక పోవడం వల్ల నెలకు సమారు 10 రోజులు సెకండ్ షోలు వేయడం మానివేశారు.
మూతపడిన హాళ్లు ఏమయ్యాయి..?
నగరంలో గత 10 ఏళ్ల క్రితం కొత్తవి, పాతవి కలిపి 12 సినిమా హాళ్లు పోటాపోటీగా లాభసాటిగా నడిచేవి. కానీ ప్రస్తుతం ఇందులో 7 సినిమా హాళ్లు మూతపడ్డాయి. మరో 5 సినిమా హాళ్లు నష్టాల బాటలో నడుస్తున్నాయి. మూసివేసిన సినిమా హాళ్లలో జ్యోతి సినిమా హాల్ త్రీ స్టార్ హోటల్‌గా మారితే, విజయ టాకీస్ కల్యాణ మండపంగా మారింది. ఉత్కళ్ సినిమా హాల్ అపార్ట్‌మెంట్‌గా మారితే, మొట్టమొదటి సినిమా హాల్ ఎస్‌ఎస్‌వీటీ కుటుంబాల తగాదాలతో శిథిలావస్థకు చేరిది. కొత్త హాళ్లలో లింగరాజ్ సినిమా హాల్ కల్యాణ మండపంగా మారితే, పద్మిని సినిమా హాల్ వాహనాల షోరూంగా మారింది. నిన్న, మొన్నటి వరకు నడిచిన పరంజ్యోతి సినిమా హాల్ ఫైలీల్ తుఫాన్‌తో పూర్తిగా నేలకొరిగి మూతపడింది. ఈ పరిస్థితి చూసి కొమ్మపల్లిలో సినిమాహాల్ నిర్మాణం సగంలోనే అగిపోయింది.
మూతబడిన సగం థియేటర్లు
ఈ సందర్భంగా స్థానిక గౌతం సినిమాహాల్ యజమాని కోట్ని శివప్రసాద్ సాక్షితో మాట్లాడుతూ...ప్రతిరోజూ టీవీల్లో 10 తెలుగు సినిమాలు 15 హిందీ సినిమాలు, పదుల సంఖ్యలో సీరియల్స్ ప్రసారం కావడం, సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజే మార్కెట్‌లోకి పైరసీ సీడీలు విచ్చల విడిగా చలామణి కావడంతో రాష్ట్రంలో సగానికి పైగా సినిమా హాల్స్ మూతపడ్డాయని చెప్పారు.
పైరసీ అరికట్టకపోతే
పైరసీ సీడీలను అరికట్టకపోతే ఉన్న సినిమా హాళ్లు కాడా మూత పడే ప్రమాదం ఉందని సినిమా హాళ్ల యజమానులు అవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో పైరసీ సీడీలు అరికట్టేందుకు కొత్త చట్టం అమలు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఒరిస్సా ఫిల్మ్ డిస్టిబూటర్స్ సంఘం అధ్యక్షుడు పెల్లి బాబు తెలియజేస్తున్నారు.