కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య హవా పతనం ప్రారంభమైందని బీజేపీ నేత, బళ్లారి లోక్‌సభ సభ్యుడు
బళ్లారి ఎంపీ శ్రీరాములు
సింధనూరు టౌన్ : కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య హవా పతనం ప్రారంభమైందని బీజేపీ నేత, బళ్లారి లోక్‌సభ సభ్యుడు బీ.శ్రీరాములు అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం నగరంలోని బీజేపీ నాయకుడు కొల్లా శేషగిరిరావు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. బెంగళూరులోని హెబ్బాళ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సిద్దరామయ్య తన ఆప్తుడు బైరతి సురేష్‌కు టికెట్ సాధించడంలో విఫలం కావడం కాంగ్రెస్ పార్టీలో ఆయన హవా పతనం ఆరంభమైనట్లుగా సూచిస్తోందన్నారు.
కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గె గతంలో నుంచి కాంగ్రెస్ అధిష్టానం వద్ద పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఇంకా పరిహారం పంపిణీ కాలేదన్నారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న దేవదుర్గ, బీదర్ నార్త్, హెబ్బాళ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం ఖాయమన్నారు. త్వరలో జరుగనున్న జెడ్పీ, టీపీ ఎన్నికల్లో కూడా బీజేపీ అత్యధిక స్థానాలు గెలుపొందుతుందన్నారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు కొల్లా శేషగిరిరావు, అమరేగౌడ విరుపాపుర, దేవేంద్రప్ప యాపలపర్వి, బసప్ప కల్లూరు, బసనగౌడ తుర్విహాళ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.