‘‘విశ్వక్ సేన్‌కి, సిద్ధుకి చాలాసార్లు చెప్పాను. మీపై నమ్మకం ఉంది.. ఇండస్ట్రీ ముందుకు వెళ్లడానికి చాలా సాయపడతారు, కష్టపడతారు అని. ఈ రోజు వారిద్దర్నీ చూస్తుంటే చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లటానికి చిత్ర పరిశ్రమకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న విడుదలైంది.
ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ‘డబుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ టిల్లు స్క్వేర్’ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘నవ్వించడం ఓ వరం. నవ్వకపోవడం అనేది శాపం. నేను నవ్వడం మొదలుపెడితే ఆపుకోవడం కష్టం. అలాంటిది నేను ఇక నవ్వలేను బాబోయ్ అనేలా ‘టిల్లు స్క్వేర్’తో నవ్వించాడు సిద్ధు.. చాలామందిని నవ్వించాడు. మల్లిక్ రామ్‌గారు ‘టిల్లు స్క్వేర్’ని అద్భుతంగా తీశారు. అనుపమ, నేహాశెట్టి లేకపోతే ఈ సినిమా ఇంత హిట్టయ్యేది కాదు. ఇక ‘దేవర’ సినిమా రిలీజ్ లేట్ అయినా సరే.. రేపు మీరందరూ (ఫ్యాన్స్) కాలర్ ఎగరేసుకునేలా ఆ చిత్రాన్ని అందించటానికి ప్రయత్నిస్తాం’’ అన్నారు.
డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘టిల్లు స్క్వేర్’ వంద కోట్లు చేసింది. ‘దేవర’తో ఎన్టీఆర్ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాలి’’ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ–‘‘త్రివిక్రమ్‌గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలకి నీకు ఏవైనా అవార్డులు వచ్చాయా? అని నన్ను చాలామంది అడిగారు. వారందరికీ ఎన్టీఆర్ అన్న నా గురించి మాట్లాడిన వీడియో చూపించి.. ఇంతకంటే పెద్ద అవార్డు ఏదైనా ఉందా? అన్నాను’’ అన్నారు. ‘‘అందరి కృషి వల్లే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది’’ అన్నారు మల్లిక్ రామ్.
Comments
Please login to add a commentAdd a comment