‘సుప్రీం’కు వెళతాం
సాక్షి, చెన్నై: ములై్ల పెరియార్ డ్యాం నీటి మట్టం తగ్గింపు లక్ష్యంగా సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నామని కేరళ సీఎం ఉమన్ చాందీ స్పష్టం చేశారు. తమిళనాడుకు నీళ్లు ఇవ్వడం కుదరదని ఎన్నడూ తాము చెప్పలేదన్న విషయాన్ని గుర్తుంచుకోండని సూచించారు. ఈ మేరకు సోమవారం చెన్నైలో ఉమన్ చాందీ మీడియాతో మాట్లాడారు. ములై్ల పెరియార్ డ్యాంకు వ్యతిరేకంగా కేరళ అనేక కుట్రలు చే స్తున్న విషయం తెలిసిందే. ఆ డ్యాం నీటిమట్టం పెంపును అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాల్లో ఉన్న కేరళ సర్కారు, ఇక సుప్రీం కోర్టులో తేల్చుకునేందుకు సిద్ధం అయింది. తమ ప్రజల భద్రతను అస్త్రంగా చేసుకుని నీటి మట్టం తగ్గించి తీరుతామన్న ధీమాను చెన్నై వేదికగా ఉమన్ చాందీ వ్యక్తం చేయడం గమనించాల్సిందే.
సుప్రీంకు వెళతాం: పూందమల్లి రోడ్డులోని కేరళ సమాజంలో ఉదయం పలు ప్రారంభోత్సవాలు, సామూహిక వివాహ వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమాల నిమిత్తం ఉదయాన్నే కేరళ సీఎం చెన్నైకు ఉమన్ చాందీ వచ్చారు. ఆయనకు కేరళ సమాజం నేతలు ఘన స్వాగతం పలికారు. తమిళనాడు నుంచి కేరళకు ఖనిజ సంపదల అక్రమ రవాణా వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ మీనంబాక్కం విమానాశ్రయంలో ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. అక్రమార్కుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠినశిక్ష తప్పదని హెచ్చరించారు. అక్కడి నుంచి నేరుగా కేరళ సమాజం చేరుకున్నారు. అక్కడ నూతన భవన ప్రారంభోత్సవం అనంతరం, పది జంటలకు సామూహిక వివాహాల్ని జరిపించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన ములై్ల పెరియార్ వ్యవహారం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
మా ప్రజల భద్రతమే ముఖ్యం : ములై్ల పెరియార్ డ్యాం నీటి మట్టాన్ని తగ్గించాలని మాత్రమే తాము కోరుతూ వస్తున్నామని వివరించారు. అయితే, నీటిని ఇవ్వబోమని ఎక్కడా, ఏ సందర్భంలోనూ తాము చెప్పింది లేదన్నారు. తమిళనాడులోని ఆరు జిల్లాల ప్రజల నీటి అవసరాల గురించి తనకు తెలుసునని, ఆ ప్రజలకు నీళ్లు ఇవ్వం అని తాము చెప్పే ప్రసక్తే లేదన్నారు. అయితే, తమ ప్రజల భద్రతను పరిగణనలోకి తీసుకుని డ్యాం నీటి మట్టాన్ని తగ్గించాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. ఆ డ్యాం నిర్మించి 117 ఏళ్లకు పైగా కావస్తున్నదని, అప్పటి టెక్నాలజీ వేరు అని వివరించారు. ప్రస్తుతం ఆ డ్యాం పటిష్టత గురించే తాము ప్రస్తావిస్తూ వస్తున్నామని, ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు.
ఎప్పుడో నిర్మించిన ఈ డ్యాంపై తమకు అనేక అనుమానాలు ఉండడం సహజం అని పేర్కొంటూ, ఈ డ్యాం రూపంలో ఎక్కడ తమ ప్రజలకు ప్రమాదం ఎదురవుతుందోనన్న ఆందోళన వెంటాడుతోందన్నారు. తమిళనాడులో పెద్ద సంఖ్యలో మలయాళీయులు ఉన్నారని గుర్తు చేస్తూ, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాము డ్యాం వ్యవహారంలో చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తమిళ ప్రజల నీటి ఆవశ్యకతను తాము గుర్తించామని, వారికి అన్యాయం తలబెట్టడం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తమ ప్రజల భద్రతే ముఖ్యం అని, ఈ విషయాన్ని సుప్రీం కోర్టుకు వివరిస్తామని, ములై్ల పెరియార్ డ్యాం నీటి మట్టాన్ని తగ్గించే విధంగా తమ వాదనల్ని వినిపిస్తామన్నారు. సుప్రీం కోర్టులో తమకు న్యాయం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.