చెన్నై, సాక్షి ప్రతినిధి:చెన్నై ప్రావిన్స్-తిరువాన్గూరు సంస్థానాల మధ్య 999 ఏళ్లకు చేసుకున్న ఒప్పందం మేరకు ముల్లైపెరియార్ రిజర్వాయరు నిర్మాణం 1895లో పూర్తయింది. రిజర్వాయరు మొత్తం ఎత్తు 152 అడుగులు. తమిళనాడులోని తేనీ, రామనాథపురం, శివగంగై, దిండుగల్లు, మధురై జిల్లాల రైతులు ఈ రిజర్వాయరు ద్వారా విడుదలయ్యే సాగునీటిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. రిజర్వాయరు నిర్వహణ బాధ్యతలను ప్రజాపనుల శాఖ నిర్వహిస్తుండగా, ముల్లైపెరియార్ కేరళ సరిహద్దులో ఉన్నకారణంగా ఆ ప్రభుత్వం తరచూ సమస్యలు సృష్టిస్తోంది. రిజర్వాయరులోని నీటి మట్టాన్ని 136 అడుగుల నుంచి 142 అడుగులకు పెంచాలని కొన్ని దశాబ్దాలుగా కేరళను రాష్ట్రం కోరుతోంది. రిజర్వాయరు బలహీనంగా ఉందనే నెపంతో కేరళ ప్రభుత్వం నిరాకరించింది దీంతో తమిళనాడు ప్రభుత్వం 2006లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అనుకూలమైన తీర్పు వచ్చింది. అయినా ఈ తీర్పును అమలుచేసేందుకు కేరళ ససేమిరా అనడంతోపాటూ కొత్త రిజర్వాయరు నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించింది.
రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సుప్రీంలో అప్పీల్ చేసింది. తమిళనాడుకు చెందిన రిైటైర్డు న్యాయమూర్తి లక్ష్మణన్, కేరళకు చెందిన రిటైర్డు న్యాయమూర్తి థామస్‌తోపాటూ ఇద్దరు రిటైర్డు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని సుప్రీం కోర్టు నియమించింది. ఈ బృందం 2010లో రిజర్వాయరును పరిశీలించి సుప్రీం కోర్టుకు నివేదికను సమర్పించింది. అప్పటి నుంచి గత ఏడాది ఆగస్టు 20వ తేదీ వరకు రెండు రాష్ట్రాల వాదోపవాదాలను విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వుచేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లోథాతోపాటూ మరో ఐదుగురు న్యాయమూర్తులు బుధవారం తీర్పును ప్రకటించారు. ముల్లైపెరియార్ రిజర్వాయరులో నీటి మట్టాన్ని 136 అడుగుల నుంచి 142 అడుగుల ఎత్తుకు పెంచాలని, కేరళ ప్రభుత్వం తీసుకువచ్చిన రిజర్వాయర్ రక్షణ చట్టం చెల్లదని వారు తీర్పు చెప్పారు.
హర్షాతిరేకాలు
ముల్లైపెరియార్ రిజర్వాయరులో నీటిమట్టం పెంపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రీం తీర్పుతో ప్రధానంగా లాభం చేకూరే ఐదు జిల్లాలైన తేనీ, రామనాథపురం, శివగంగై, దిండుగల్లు, మధురైలకు చెందిన అనేక రైతు సంఘాలు రోడ్లలో బాణాసంచా కాల్చి పండుగ చేసుకున్నాయి. ఐదు జిల్లాల్లో 73 లక్షల మందికి వ్యవసాయమే జీవనాధారం. సుప్రీం కోర్టు ప్రతికూలంగా వచ్చి ఉంటే లక్షలాది మంది రైతుల బ్రతుకు ప్రశ్నార్థకమయ్యేది. సాగునీటి కొరత కారణంగా ఈ ఐదు జిల్లాల్లో 3 లక్షల ఎకరాలకు గాను 1.75 లక్షల ఎకరాలను మాత్రమే సాగు చేస్తున్నారు. కనీసం ఒక పంట కూడా సమృద్ధిగా చేతికందడం లేదు. డ్యాంలో నీటిమట్టం పెంపుపై తమిళనాడు రైతుల్లో భయాందోళనలు కలగజేసేందుకు కేరళ ప్రభుత్వం ఁడ్యాం 999రూ. అనే సినిమాను తీసింది. నీటిమట్టం పెంపుతో బలహీనమైన ముల్లైపెరియార్ డ్యామ్ బద్ధలైనట్లు, వేలాది మంది ప్రజలు ప్రాణాలు విడిచినట్లు అందులో చూపారు. అయితే తమిళనాడు ప్రభుత్వం ఈ సినిమా రాష్ట్రంలో విడుదల కాకుండా నిషేధం విధించింది. ఇటువంటి బెదిరింపులకు తాము భయపడబోమని కేరళను హెచ్చరించింది. సీఎం జయలలిత, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, పీఎంకే అధ్యక్షుడు రాందాస్ తమ హర్షాన్ని వెలిబుచ్చారు. రిజర్వాయరులో నీటిమట్టాన్ని 136 అడుగుల నుంచి 142 అడుగులకు పెంచడం వల్ల అదనంగా లక్ష ఎకరాలకు లబ్ధి చేకూర్చేలా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని రైతులు ఆనందం వెలిబుచ్చారు.
‘ముల్లైపెరియార్’కల సాకారం
Published Wed, May 7 2014 11:20 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement