కేరళ కుట్రకు చెక్
ముల్లై పెరియార్ డ్యాం వ్యవహారంలో తమిళనాడుకు మరో విజయం చేకూరింది. కేరళ కుట్రలకు చెక్ పెట్టే విధంగా సుప్రీం కోర్టు స్పందించింది. పునః పరిశీలన పిటిషన్‌ను తిరస్కరిస్తూ కేరళ చర్యలకు కళ్లెం వేసింది.
సాక్షి, చెన్నై: ముల్లై పెరియార్ డ్యాం నీటి మట్టాన్ని ఇటీవల 142 అడుగులు పెంచిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల అనంతరం ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆ మట్టానికి నీళ్లు చేరాయి. అయితే, ఈ మట్టానికి నీళ్లు నిల్వ ఉంచిన పక్షంలో తమ ప్రజలకు భద్రత లేదని, డ్యాం బలహీనంగా ఉందని ఆరోపిస్తూ పలు రకాల కుట్రలకు కేరళ సర్కారు వ్యూహ రచనలు చేసింది. సుప్రీం కోర్టు తీర్పును పునః పరిశీలించే విధంగా ఒత్తిడి తెచ్చే పనిలో పడింది. ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను సుప్రీం కోర్టులో దాఖలు చేసింది.
డ్యాంకు వ్యతిరేకంగా కేరళ దాఖలు చేసిన పునః పరిశీలన పిటిషన్ విచారణ మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని రాజకీయ శాసనాల బెంచ్ ముందుకు వచ్చింది. అయి తే, ఈ విచారణకు తమిళనాడు, కేరళ అధికారులను అనుమతించలేదు. దీంతో విచారణ వివరాలు బయటకు రాలేదు. డ్యాం వ్యవహారంలో గతంలో ఇచ్చిన తీర్పు పునఃసమీక్షకు సుప్రీం కోర్టు నిర్ణయించిందా? లేదా తిరస్కరించిందా? అన్న ఉత్కంఠ బయలు దేరింది. ఈ పరిస్థితుల్లో విచారణలో వెల్లడించిన తీర్పు వివరాల్ని బుధవారం సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ ప్రకటించడంతో తమిళనాడుకు మరో విజయం చేకూరినట్టు అయింది.
తమ తీర్పులో కేరళ కుట్రలకు సుప్రీం కోర్టు చెక్ పెట్టింది. డ్యాం నీటి మట్టం 142 అడుగులకు చేరిందని, డ్యాం పటిష్టంగా ఉందని తాము నియమించిన కమిటీ సైతం స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. తాము ఇది వరకే స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగిందని, ఇందులో పునః పరిశీలించాల్సిన అవసరం లేదని బెంచ్ తేల్చింది. డ్యాం వ్యవహారంలో పునః పరిశీలించాల్సిన అవసరం లేని దృష్ట్యా, ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని తోసి పుచ్చడంతో తమిళనాడు హక్కుల్ని మళ్లీ సుప్రీం కోర్టు రక్షించింది. ఇక ఆ ఉత్తర్వులను తేని, దిండుగల్, శివగంగై, రామనాధపురం, మదురై జిల్లాల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భద్రత : సుప్రీం కోర్టు మళ్లీ డ్యాం విషయంలో తమిళనాడుకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వడంతో ఇక, ఆ డ్యాం భద్రతా వ్యవహారాల్ని రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రం తమ చేతిలోకి తీసుకోవాలన్న డిమాండ్‌ను అన్నదాతలు తెరమీదకు తెచ్చారు. డ్యాం వైపుగా తమిళ అధికారుల్ని వెళ్లనీయకుండా కేరళ పోలీసులు అడ్డుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. దీనిని పరిగణనలోకి తీసుకుని, డ్యాం భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకోవాలని ఎండీఎంకే నేత వైగో డిమాండ్ చేశారు. లేదా కేంద్ర రిజర్వు బలగాలకు ఆ డ్యాం భద్రతను అప్పగించాలని కోరారు. ఆ డ్యాం భద్రత వ్యవహారాలు కేరళ చేతిలో ఉన్న పక్షంలో మరేదేని కుట్రలు జరిగే అవకాశం ఉందని, దీనిని పరిగణనలోకి తీసుకుని డ్యాం భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.