బళ్లారి : ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని మంగళవారం రాత్రి విమ్స్ వైద్యుల సూచన మేరకు బెంగళూరు కొలంబియా ఏషియా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి విమ్స్ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి నేతృత్వంలో వైద్య బృందం ప్రత్యేక చికిత్సలు చేపట్టారు.
విమ్స్‌లో రైల్స్ ట్యూబ్ ద్వారా పురుగులు మందును బయటకు తీశారు. పామ్స్, ఆట్రోపిన్ యాంటిబయాటిక్ మందులు ఇస్తూ చికిత్సలు చేపట్టారు. ఐసీయూలోకి తరలించినా జన సందోహాన్ని పోలీసులు నియంత్రించడానికి వీలుకాలేదు. దీంతో మెరుగైన చికిత్స అందించాలంటే ప్రత్యేక వాతావరణం ఉండాలని వైద్యులు నిర్దారణకు వచ్చారు.
అంతేకాకుండా 48 గంటల వరకు ఎలాంటి హామీ ఇవ్వలేమని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు రాత్రి 8 గంటల సమయంలో ప్రైవేటు అంబులెన్స్‌లో బెంగళూరులోని కొలంబియా ఏషియా ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌లో విమ్స్ వైద్యులు, కాపు సతీమణి భారతి, తనయుడు ప్రవీణ్ ఇతర ప్రముఖులు బయలుదేరి వెళ్లారు.
నా భర్తకు ఏమైనా జరిగితే పోలీసు స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటాం : భారతి
కాపు రామచంద్రారెడ్డి భార్య భారతి సాక్షితో మాట్లాడుతూ తన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసులే కారణమన్నారు. ఆయనకు ఏమైనా జరిగితే తమ కుటుంబసభ్యులంతా పోలీసు స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని కన్నీరుమున్నీరుగా విలపించారు.
కాపును పరామర్శించిన ప్రముఖులు
బళ్లారి విమ్స్‌లో చికిత్స పొందుతున్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. బళ్లారి ఎంపీ శాంత, రాయచూరు ఎంపీ సన్నపక్కీరప్ప, అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలు వెంకటరామిరెడ్డి, తిప్పేస్వామి, ఆలమూరు సాంబశివారెడ్డి, చవ్వా రాజశేఖర రెడ్డి, బళ్లారి టచ్‌ఫర్ లైఫ్ ఫౌండేషన్ అధినేత నారా భరత్‌రెడ్డి, మాజీ ఉపమేయర్ శశికళ, మాజీ కార్పొరేటర్ కేఎస్. దివాకర్ వీరశంకర్‌రెడ్డి, మానవహక్కుల సంఘం నాయకులు ప్రవీణ్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, బుజ్జిరెడ్డి, భోజరాజు నాయక్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.