అంతా సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవేశపెట్టిన రూ.1.42 లక్షల కోట్ల అంచనాతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పథకాల అమలుకు నిధుల సేకరణ పెద్ద సవాలుతో కూడుకున్నది. దీంతో చాలా పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో పూర్తి చేయాలని భావిస్తోంది. గత ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం పన్నుల రూపంలో వసూలులో చేయాలని నిర్దేశించుకున్న లక్ష్యం కంటే రూ.1,500 కోట్లు వెనుక బడిపోయింది. అంతే కాకుండా రానున్న ఆర్థిక ఏడాది (2015-16)కి కేంద్రం తన బడ్జెట్‌లో అనేక రకాల సబ్సిడీలకు, సంక్షేమ పథకాలకు కోత విధించింది. దీంతో కేంద్ర సహకారంతో రాష్ట్రంలో అమలవుతున్న కొన్ని పథకాల్లో దాదాపు రూ.4,900 కోట్లకు కోత పడనుంది.
ఈ విషయాలన్నీ తెలిసినా త్వరలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సిద్ధరామయ్య గత ఏడాది కంటే ఎక్కువ అంచనాలు గల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో తాజా బడ్జెట్‌లో పేర్కొన్న మొత్తం నిధుల్లో ఎక్కువ భాగం ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలతోపాటు బడ్జెట్‌లో కొత్తగా పేర్కొన్న షూ, పశు తదితర ‘భాగ్య’లకే ఖర్చయ్యే సూచనలు ఉన్నాయి. దీంతో తాజా బడ్జెట్‌లో ప్రస్తావించిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రైవేటు సహకారం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మేరకు ఇప్పటికే అన్నిప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బడ్జెట్‌లో పేర్కొన్న అభివృద్ధి కార్యకమాలకు సంబంధించి ప్రైవేటు భాగస్వామ్యం విధానంపై నివేదిక తయారు చేయాలని సిద్ధరామయ్య ప్రభుత్వం పేర్కొంది.
ఇలా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రైవేటు సహకారం తీసుకోవడం వల్ల రాష్ట్రంలోని ప్రజలపై పరోక్షంగా పన్నుల భారం పెరగనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతి కుంటుబడుతుందని విశ్లేషిస్తున్నారు. ఈ విషయమై బెంగళూరు విశ్వవిద్యాలయ ఆర్థిక విభాగనికి చెందిన ప్రొఫెసర్ ఒకరు మాట్లాడుతూ...‘కేంద్ర సాయం తగ్గడం, గత ఏడాది పన్నుల వసూలులో అనుకున్న లక్ష్యం చేరక పోవడం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని సిద్ధరామయ్య వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌ను తయారు చేసి ఉండాల్సింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది కంటే ఎక్కువ అంచనాలతో రూపొందించిన తాజా బడ్జెట్ పేరుకు పెద్దది తప్పస్తే దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే బలుపే తప్ప బలం లేదు.’ అని పేర్కొన్నారు.
పీపీపీ విధానంలో అమలు చేయాలని భావిస్తున్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు
సాయిల్ హెల్త్ మిషన్
చేపల అమ్మక కేంద్రాలు, అల్పాహార కేంద్రాల ఏర్పాటు
హుబ్లీ, తుమకూరుల్లో శీతల గిడ్డంగుల ఏర్పాటు
రాష్ట్రంలోని 17 పట్టణాల్లో ఘణ వ్యర్థాల నుంచి ఎరువుల తయారీ కేంద్రాలు
హేమావతి, కబిని ఆనకట్టల వద్ద ఉద్యానవనాల ఏర్పాటు
పీ 3మయం
Published Mon, Mar 16 2015 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM
Advertisement
Advertisement