బడ్జెట్‌లో సేద్యానికి పెద్దపీట
అంచనా వేస్తున్న నిపుణులు
బెంగళూరు: ఈ సారి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవేశపెట్టేబోయే బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయనున్నారని తెలుస్తోంది. రెండేళ్ల పాటు ఎటువంటి ఎన్నికలు లేకపోవడం వల్ల అన్నభాగ్య, క్షీరభాగ్య, తదితర సంక్షేమపథకాల కంటే రైతులకు మేలు చేసే విధానాలను బడ్జెట్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పొందుపరచనున్నట్లు సమాచారం. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవితో పాటు ఆర్థికశాఖను కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత (2013) వరుసగా సిద్ధరామయ్య పూర్తిస్థాయి బడ్జెట్‌ను మూడోసారి, మొత్తంగా 11వ సారి శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఉచిత సంక్షేమ పథకాల కంటే వ్యవసాయ రంగానికి సీఎం సిద్ధరామయ్య తన బడ్జెట్‌లో పెద్దపీఠ వేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వరుసగా రెండో ఏడాది తీవ్రవైన కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. దీంతో సాగు నీటితో పాటు పశుపోషణ కష్టంగా ఉంది.
అంతేకాకుండా సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో బీడు భూములకు నీటిపారుదల సౌకర్యం కల్పించలేదు. దగ్గర్లో ఏ ఎన్నికలు లేనందున ఒకటి రెండు సంక్షేమపథాకాలు మినహా గతంలో మాదిరిగా చెప్పుకోదగ్గ సంక్షేమపథకాలు బడ్జెట్‌లో పొందుపరిచే అవకాశం లేదని సమాచారం. 2016-17 బడ్జెట్‌లో సంక్షేమం కంటే రైతులకు మేలుచేకూర్చేలా వ్యవసాయ రంగంపై సిద్ధరామయ్య ఎక్కువ దృష్టిసారించనున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
అప్పుల కుప్పలు...
రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు ఎక్కువ ప్రాథాన్యత ఇవ్వడం వల్ల వాటి అమలుకు వివిధ రూపాల్లో ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రోజువారి ప్రభుత్వ నిర్వహణ ఖర్చు కూడా పెరుగుతూ పోతోంది. దీంతో సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర అప్పులు రూ.59,323 కోట్లు. దీంతో రాష్ట్రంలోని ఒక్కొక్కరి తల పై రూ.28,819 ఆప్పు ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు లెక్కగట్టారు.
సర్కార్ రైతు బాట
Published Thu, Mar 17 2016 2:35 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement