రెండోరోజూ రభస | Nagpur Assembly session again postponed | Sakshi
Sakshi News home page

రెండోరోజూ రభస

Published Wed, Dec 18 2013 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

Nagpur Assembly session again postponed

నాగపూర్: రెండోరోజు కూడా అదే దృశ్యం పునరావృతమైంది. ప్రతిపక్షంతోపాటు అధికార పక్షం కూడా సభలో తీవ్ర గందరగోళం సృష్టించడంతో అనేక పర్యాయాలు వాయిదాపడింది. చివరికి సభాపతి బుధవారానికి వాయిదా వేశారు. సభా కార్యకలాపా లు ప్రారంభమైన అనంతరం 48వ నిబంధన కింద సభకు వివరణ ఇచ్చేందుకు తొలుత పరిశ్రమల శాఖ మంత్రినారాయణ్ రాణే పైకి లేవగానే ప్రతిపక్ష సభ్యులు రాణేతోపాటు కళంకిత మంత్రులను పదవులను తప్పించాలంటూ నినదించడం ప్రారంభించారు. దీంతో సభ గంటపాటు వాయిదాపడింది. తిరిగి సభా కార్యకలాపాలు మొదలవగానే సభాపతి స్థానంలో ఆశీసునుడైన నవాబ్ మాలిక్... ఒకసభ్యుడు 48వ నిబంధనను వినియోగించుకుంటే మరో సభ్యుడు 22వ నిబంధనను వాడుకునేందుకు కుదరదంటూ ప్రతిపక్ష నాయకుడు ఏక్‌నాథ్ ఖడ్సేను మాట్లాడనీయకుండా అడ్డుకున్నారు. అనంతరం  పరిశ్రమల శాఖ మంత్రినారాయణ్ రాణే మాట్లాడుతూ జల్గావ్ పాల సహకార సంఘం అంశం అత్యంత పురాతనమైనదన్నారు.
 
 ఈ కుంభకోణానికి సంబంధించి నగ్రే పాటిల్ అనే భద్రతా అధికారిని తొలుత సస్పెండ్ చేశామని, ఆ తర్వాత కర్తవ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించాడనే ఆరోపణలు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించామన్నారు. 1995 నాటి ఈ ఆర్థిక అక్రమాల కేసులో తాను మోసగాడిన ని, దొంగనంటూ ఏక్‌నాథ్‌ఖడ్సే నిందించారని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఖడ్సే తన మంత్రివర్గ సహచరుడని గుర్తుచేశారు. తనను ఇలా పిలవడమంటే అతనిని అతనే ఆవిధంగా పిలుచుకున్నట్టవుతుందన్నారు. కుంభ కోణంలో నిందితుడనే పదం ఖడ్సేకి కూడా వర్తిస్తుందన్నారు. అందువల్ల ఖడ్సే తనకు క్షమాపణ చెప్పాలని రాణే డిమాండ్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎంతో బాగా విశ్వసించే లెఫ్టినెంట్‌లు ఆనందిబెన్ పటేల్, పురుషోత్తం సోలంకిలపై నేరాభియోగాలు నమోదయ్యాయని, అందువల్ల ఇక్కడి మంత్రుల గురించి ఖడ్సే ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదన్నారు.
 
 చివరికి బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ లంచం తీసుకుంటూ కెమెరాకి దొరికిపోయారన్నారు. అనంతరం అధికార ప్రజాస్వామ్య కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రతిపక్షంపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా వెల్‌లోకి దూసుకుపోయాయి. బాబా సిద్ధిఖి, అమీన్ పటేల్, విజయ్ వడ్డెటివార్, వీరేంద్ర జగ్తాప్ (కాంగ్రెస్), జితేంద్ర అవాడ్‌లు ప్రతిపక్షానికి వ్యతిరేకంగా సభలో గట్టిగా నినదించారు.  ఇదే సమయంలో ప్రతిపక్ష సభ్యులైన గిరీష్ మహాజన్, యోగేష్ సాగర్, తారాచంద్ సింగ్ (బీజేపీ), ఏక్‌నాథ్ ఖడ్సే (శివసేన) పోడియంపైకి ఎక్కారు. దీంతో సభాపతి స్థానంలో ఉన్న నవాబ్‌మాలిక్ సభను మరో పది నిమిషాలపాటు వాయిదా వేశారు. మరలా సభాకార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ అనిశ్చితి తొలగిపోలేదు. దీంతో మరోసారి 30 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి మరోసారి సభ ప్రారంభం కాగానే సదాశివ్ పాటిల్ సభాపతి స్థానంలో ఆశీనులయ్యారు.
 
 ఆ తర్వాత  పైకిలేచిన పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే 22వ నిబంధనను ప్రస్తావించడంద్వారా ప్రతిపక్ష నాయకుడు ఏక్‌నాథ్ ఖడ్సేని మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీనిని సభాపతి స్థానంలో ఉన్న సదాశివ్ సమర్థించారు. దీంతో అటు ప్రతిపక్షంతోపాటు ఇటు అధికార పక్ష సభ్యులు కూడా వెల్‌లోకి దూసుకుపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పరిస్థితిని మెరుగుపరిచేందుకు సభాపతి స్థానంలో ఉన్న సదాశివ్ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆయన రోజంతా సభను వాయిదా వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement