నేడే మోడీ రాక
Published Sat, Apr 12 2014 11:44 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
సాక్షి, చెన్నై : డీఎంకే, అన్నాడీంకేలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ నేతృత్వంలో రాష్ర్టంలో కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఈ కూటమికి ప్రజా మద్దతు క్రమంగా పెరుగుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే ఓట్లను పెద్ద ఎత్తున ఈ కూటమి చీల్చబోతున్నట్టు, కొన్ని స్థానాల్లో పాగా వేయబోతున్నట్టుగా సర్వేలు పేర్కొంటున్నాయి. ఈ కూటమి తరపున ముఖ్య నేతలుగా ఉన్న అన్భుమణి రాందాసు(పీఎంకే), ఎల్‌కే సుదీష్(డీఎండీకే), వైగో(ఎండీఎంకే), పొన్ రాధాకృష్ణన్, సీపీ రాధాకృష్ణన్, ఇలగణేషన్ (బీజేపీ), ఈశ్వరన్(కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి), పారివేందన్(ఐజేకే), ఏసీ షణ్ముగం(పుదియ నిధి) ఎన్నికల బరిలో ఉన్న చోట్ల పోటీ నువ్వా...నేనా అన్నట్టుగా ఉంది. ఈ దృష్ట్యా, కనీసం ఈ సీట్లను దక్కించుకున్నా, తమ సత్తాను చాటుకున్నట్టు అవుతుందన్న ధీమాతో ఆ కూటమి నేతలు ఉరకలు తీస్తున్నారు. ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నం అయ్యారు. అదే సమయంలో బీజేపీ అగ్ర నేతలు ఇక్కడ ప్రచారం చేస్తే తమ విజయానికి మరింత దోహద పడుతుందన్న ఆశాభావం ఆ కూటమిలో ఉంది. ప్రధానంగా మోడీతో ప్రచా రం చేసిన పక్షంలో తమ బలం పెరిగినట్టేనన్న ధీమాతో ఉన్నారు. దీంతో మోడీని ఇక్కడికి రప్పించేందుకు పలు రకాలుగా చర్యలు తీసుకున్నారు.
ఆయన పర్యటనకు తగ్గట్టుగా పలు తేదీలను సిద్ధం చేశారు. మరి కొద్దిరోజుల్లో ఆయన తమిళనాడుకు రావడం తథ్యమన్న సంకేతాలు వెలువడ్డాయి.అయితే, తేదీల విషయంలో స్పష్టత రాలేదు. ఈ పరిస్థితుల్లో ఆదివారం మోడీ చెన్నైలో పర్యటించేందుకు సిద్ధం అయ్యారన్న సమాచారంతో రాష్ట్రంలోని కమలనాథులు ఉరకలు పరుగులు తీస్తున్నారు. మోడీ పర్యటన ఖరారు కావడంతో చెన్నైలో ఆయన ప్రచార సభ కోసం ఆగమేఘాలపై ఏర్పాట్లలో రాష్ట్ర పార్టీ వర్గాలు పడ్డాయి. పార్టీ నాయకులు మోహన్ రాజులు, వానతీ శ్రీనివాసన్ నేతృత్వంలోని కమిటీ హుటాహుటిన చర్యలు చేపట్టింది. మీనంబాక్కం విమానాశ్రయం సమీపంలోని జైన్ కళాశాల మైదానాన్ని ప్రచార సభకు వేదికగా సిద్ధం చేశారు.
సాయంత్రం చెన్నైకు వచ్చే మోడీ ప్రచార సభ అనంతరం మళ్లీ గుజరాత్‌కు బయలు దేరి వెళ్లనున్నారు. మీనంబాక్కం విమానాశ్రయూనికి కూత వేటు దూరంలో ఈ మైదానం ఉన్న దృష్ట్యా, మోడీ రాక పోకలకు, ప్రజలకు ఎలాం టి ఇబ్బందులు ఉండవని కమలనాథులు భావిస్తున్నారు. దక్షిణ చెన్నై బరిలో ఉన్న ఇలగణేషన్‌కు మద్దతుగా ఈ ప్రచారం సాగనుంది. ఈ విషయమై బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీ ధరరావు మీడియాతో మాట్లాడుతూ, మోడీ పర్యటన ఖరారు అయిందన్నారు. సాయంత్రం జరిగే ప్రచార సభ అనంతరం మరో మారు ఆయనకు తమిళనాడుకు వస్తారని పేర్కొన్నారు. 16,17 తేదీల్లో ఆయన వచ్చే అవకాశం ఉందని, ఈ తేదీ ఖరారు కావాల్సి ఉందన్నారు. ఈ రెండు రోజుల ప్రచారంలో కృష్ణగిరి, ఈరోడ్, సేలం, రామనాధపురం, కోయంబత్తూరు, నాగర్ కోవిల్ వేదికగా సభలు ఆగమేఘాలపై జరగబోతున్నాయి. భద్రతా ఏర్పాట్లలో నగర పోలీసు యంత్రాం గం నిమగ్నం అయింది. మీనంబాక్కం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటుగా తనిఖీలు ముమ్మరం చేశారు.
రజనీ భేటీ
చెన్నైకి వస్తున్న నరేంద్ర మోడీతో భేటీకి దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్ నిర్ణయించి ఉన్నారు. మోడీకి సన్నిహితుడిగా ఉన్న రజనీ కాంత్ మద్దతును కూడగట్టుకునేందుకు రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. తాజాగా మోడీ రాకతో ఆయన్ను కలుసుకునేందుకు మోడీ నిర్ణయించిన సమాచారం కమలనాథుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మీనంబాక్కం విమానాశ్రయంలో కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు మోడీ నిర్ణయించి ఉన్నారని, ఆ సమయంలో రజనీ కాంత్ ఆయన్ను కలుసుకునేందుకు ఏ ర్పాట్లు చేసుకున్నట్లు సంకేతాలు వస్తున్నారుు.
అద్వానీ రాక
బీజేపీ జాతీయ నాయకులు ఒకరి తర్వాత మరొకరు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. 16న బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ, 17,18,19 తేదీల్లో వెంకయ్యనాయుడు, 20న బీజేపీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నగ్వీలు రాష్ట్రంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. సీనియర్ నేత అద్వానీ, జాతీయ నేత రాజ్ నాథ్ సింగ్ పర్యటనకు సిద్ధం అయ్యారు. అయితే, వీరి తేదీలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.
Advertisement
Advertisement